KTR: రేవంత్ రెడ్డికి బంపరాఫర్... అది చెబితే రూ.50 లక్షలు పట్టే తళతళలాడే బ్యాగ్ కొనిస్తా: కేటీఆర్ ఎద్దేవా
- 'రిజువనేషన్' అనే పదానికి సీఎం స్పెల్లింగ్ చెబితే బ్యాగ్ కొనిస్తానని ఆఫర్
- ఢిల్లీకి తీసుకువెళ్లడానికి రేవంత్ రెడ్డికి బ్యాగులు అవసరమని వ్యాఖ్య
- బీఆర్ఎస్ తరఫున బ్యాగ్‌ను బహుమతిగా ఇస్తామని వెటకారం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తాను ఓ బంపర్ ఆఫర్ ఇస్తున్నానని... 'రిజువనేషన్' అనే పదానికి ఆయన స్పెల్లింగ్ చెబితే రూ.50 లక్షలు పట్టే కొత్త బ్యాగు ఇస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. మూసీ నదిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేశారు.
రేవంత్ రెడ్డి రూ.50 లక్షలతో తొమ్మిదేళ్ల క్రితం దొరికాడని, కానీ ఇప్పటి వరకు ఆయనకు శిక్ష పడలేదన్నారు. ఎవరు కసబో... ఎవరు ఏమిటో ప్రజలు తేలుస్తారన్నారు. దేశ భద్రతా వ్యవస్థకు సంబంధించిన నిర్మాణాలను అడ్డుకొని కేటీఆర్ మరో కసబ్‌లా కావాలనుకుంటున్నారా? అని నిన్న రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మాటలకు కేటీఆర్ పైవిధంగా కౌంటర్ ఇచ్చారు.
ఢిల్లీకి తీసుకువెళ్లడానికి రేవంత్ రెడ్డికి బ్యాగులు అవసరమన్నారు. కాబట్టి 'రిజువనేషన్' అనే పదానికి కింద పేపర్ చూడకుండా స్పెల్లింగ్ చెబితే తళతళలాడే కొత్త బ్యాగును ఇస్తానని వ్యంగ్యం ప్రదర్శించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ బహుమతి ఇస్తామని వెటకారంగా అన్నారు.
గ్రూప్-1 అభ్యర్థులకు అండగా ఉంటాం
గ్రూప్-1 అభ్యర్థులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అశోక్ నగర్లో అభ్యర్థులపై జరిగిన లాఠీఛార్జీని ఆయన ఖండించారు. నిరుద్యోగులపై పోలీసులు జులుం ప్రదర్శించారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ తెలంగాణ ఉద్యమం నాటి అణిచివేత చర్యలు ప్రారంభమయ్యాయన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే అశోక్ నగర్ వచ్చి హామీలు ఇచ్చిన రాహుల్ గాంధీ... ఇప్పుడు పత్తాలేకుండా పోయారని విమర్శించారు.
కేటీఆర్‌ను కలిసిన ఒమన్ అంబాసిడర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను భారత్‌లోని ఒమన్ అంబాసిడర్ ఇస్సా ఆల్ షిబానీ మర్యాదపూర్వకంగా కలిశారు. కేటీఆర్ నివాసంలో ఆయనను కలిశారు.