NZ vs WI: మహిళల టీ20 ప్రపంచకప్‌లో మరో సంచలనం.. విండీస్ బోల్తా.. ఫైనల్‌కి కివీస్!
- షార్జా వేదికగా రెండో సెమీస్‌లో తలపడ్డ న్యూజిలాండ్, వెస్టిండీస్
- ఎనిమిది పరుగుల తేడాతో విండీస్‌ను బోల్తా కొట్టించిన న్యూజిలాండ్
- దుబాయిలో ఆదివారం జరిగే ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో కివీస్ అమీతుమీ
మహిళల టీ20 ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది. శుక్రవారం షార్జాలో జరిగిన రెండో సెమీస్‌లో వెస్టిండీస్‌ను న్యూజిలాండ్ చిత్తు చేసింది. కివీస్ ఎనిమిది పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్‌కి దూసుకెళ్లింది. దుబాయి వేదికగా ఆదివారం జరిగే ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ తలపడనుంది.
మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 128 పరుగులు మాత్రమే చేసింది. విండీస్ బౌలర్ డాటిన్ 22 పరుగులకే 4 వికెట్లు తీయడంతో కివీస్ తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. ఆ తర్వాత 129 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన కరేబియన్ జట్టు 8 వికెట్లకు 120 పరుగులే చేసింది. దీంతో న్యూజిలాండ్ 8 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.
ఇక 2009, 2010లో జరిగిన తొలి రెండు టోర్నీల్లో ఫైనల్స్‌లో ఓడిన న్యూజిలాండ్.. ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాలని పట్టుదలతో ఉంది. ఇప్పటివరకు అటు దక్షిణాఫ్రికా గానీ, ఇటు న్యూజిలాండ్ గానీ ఏ ఒక్క ఐసీసీ ట్రోఫీ గెలవకపోవడం గమనార్హం. దీంతో ఈ టోర్నీలో ఎవరు గెలిచినా చరిత్రే అవుతుంది. సో.. ఈసారి టోర్నీ చరిత్రలో కొత్త చాంపియన్ రావడం ఖాయమైంది.
కాగా, ఇప్పటివరకు 8సార్లు మహిళల టీ20 వరల్డ్‌కప్ జరిగితే.. ఆరుసార్లు ఆస్ట్రేలియా టైటిల్ ఎగిరేసుకుపోయింది. అలాగే ఇంగ్లండ్, వెస్టిండీస్ చెరోసారి చాంపియన్‌గా నిలిచాయి.