India vs New Zealand: వికెట్ కీపింగ్ చేయకపోయినా రిషబ్ పంత్ బ్యాటింగ్ చేయవచ్చా?
- గాయం కారణంగా ఆట రెండో రోజు మైదానాన్ని వీడిన రిషబ్ పంత్
- గాయం కారణంగా మైదానాన్ని వీడితే బ్యాటింగ్ చేయవచ్చని చెబుతున్న ఎంసీసీ రూల్స్
- ఆట నాలుగవ రోజు పంత్ బ్యాటింగ్‌కు దిగే అవకాశం
బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూజిలాండ్-భారత్ జట్ల మధ్య తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు నిలకడగా రాణిస్తున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కేవలం 46 పరుగులకే ఆలౌట్ కావడం, కివీస్ ఏకంగా 402 పరుగులు సాధించిన నేపథ్యంలో నాలుగవ రోజు అయిన ఇవాళ్టి (శనివారం) ఆట భారత్‌కు చాలా కీలకం కానుంది. మూడవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు సాధించింది. ఆట ముగింపు చివరి బంతికి అనూహ్యంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఔట్ అయ్యాడు. దీంతో యువ బ్యాటర్ రిషబ్ పంత్ బ్యాటింగ్ చాలా కీలకం కాబోతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆట రెండవ రోజు భారత ఫీల్డింగ్ సమయంలో మోకాలి గాయం కారణంగా కీపర్ పంత్ మైదానాన్ని వీడాడు. అతడి స్థానంలో ధృవ్ జురెల్ కీపింగ్ చేశాడు. మూడవ రోజు కూడా మైదానంలోకి రాలేదు. మరి కీపింగ్ చేయకపోయినా రిషబ్ పంత్ ఇవాళ బ్యాటింగ్ చేయవచ్చా? అనే సందేహం క్రికెట్ అభిమానుల్లో వ్యక్తమవుతోంది.
ఎంసీసీ (మెల్బోర్న్ క్రికెట్ క్లబ్) నిబంధనల ప్రకారం.. ఒక ఆటగాడు గాయం కారణంగా మైదానాన్ని వీడినప్పటికీ తిరిగి అతడి పాత్రలో ఆడగలిగితే ఎలాంటి జరిమానా ఉండదు. ఎంసీసీలోని 24.3.1 రూల్ ప్రకారం.. మ్యాచ్‌లో బాహ్య గాయానికి గురై మైదానం నుంచి నిష్క్రమించినా లేదా మైదానంలోకి రాలేకపోయినా దానిని ‘పెనాల్టీ టైమ్’గా పరిగణించరు. కాబట్టి రిషబ్ పంత్ ఫీల్డింగ్ చేయకపోయినప్పటికీ బ్యాటింగ్ చేయచ్చు.
కాగా స్పిన్నర్ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఒక బంతి రిషబ్ మోకాలికి తగిలింది. పంత్కి రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు తీవ్ర గాయమై శస్త్రచికిత్స జరిగిన భాగంలోనే ఈ బంతి తాకింది. వెంటనే కొంత వాపు వచ్చింది. దీంతో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశంతో పంత్ మైదానాన్ని వీడాడు.
కాగా బెంగళూరు టెస్టులో ఆతిథ్య జట్టు భారత్‌పై చారిత్రాత్మక విజయం సాధించాలని న్యూజిలాండ్ ఉవ్విళ్లూరుతోంది. భారత్‌ను వీలైనంత త్వరగా ఆలౌట్ చేసి ఇన్నింగ్స్ తేడాతో విక్టరీ సాధించాలని చూస్తోంది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు కాస్త పుంజుకున్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత స్కోరు 231/3గా ఉంది. న్యూజిలాండ్‌కు మరో 125 పరుగుల వెనుకంజలో ఉంది. భారత్ ఇవాళ మరో 125 పరుగులు సాధిస్తే ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయే ప్రమాదం నుంచి తప్పించుకుంటుంది.