Love Reddy: ఫెయిల్యూర్ మీట్ పెట్టుకున్న 'లవ్ రెడ్డి' మూవీ టీమ్
- వినూత్నంగా ఫెయిల్యూర్ మీట్ పెట్టిన టీమ్
- ఆడియన్స్‌ను రీచ్ కాలేకపోయామన్న నిర్మాత
- సినిమాకు మంచి స్పందన ఉన్నా, తమకు సపోర్ట్ లేదని విచారం
సాధారణంగా ఓ సినిమా విడుదల వరకు చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్‌లో బిజీగా ఉంటారు. సినిమా ప్రమోషన్ కోసం రకరకాల వినూత్న పబ్లిసిటితో జనాల ముందుకు వెళుతుంటారు. ఆడియన్స్‌కు తమ సినిమాను రీచ్ చేయడానికి చాలా కష్టపడుతుంటారు.
ఇక సినిమా విడుదలైన తరువాత థ్యాంక్స్ మీట్, సక్సెస్‌మీట్‌లు నిర్వహిస్తుంటారు. సినిమా విడుదల రోజు మార్నింగ్ షో పూర్తి కాగానే సినిమా ఆఫీస్‌ల వద్ద టపాసులు కాల్చి మా సినిమా సక్సెస్ అంటూ మీడియా ముందు ఘనంగా చెప్పుకుంటారు.
అయితే ఈ శుక్రవారం విడుదలైన 'లవ్ రెడ్డి' చిత్ర యూనిట్ మాత్రం వినూత్నంగా సక్సెస్‌మీట్ స్థానంలో ఫెయిల్యూర్ మీట్‌ను పెట్టి అందర్ని ఆశ్చర్యపరిచింది. మా సినిమా బ్లాక్‌బస్టర్ బట్ ఫెయిల్యూర్ మీట్‌ను నిర్వహిస్తున్నామని టీమ్ చెబుతోంది.
"మా సినిమాను ఆడియన్స్ ఆదరిస్తున్నారు. సినిమా చూసిన వారందరూ చాలా మంచి సినిమా తీశామని అభినందిస్తున్నారు. కానీ మా సినిమాను అందరికి రీచ్ చేయలేకపోయాం... ఇది మా ఫెయిల్యూర్‌గా ఒప్పుకుని, ఫెయిల్యూర్ మీట్‌ను పెట్టుకున్నాం. లవ్ రెడ్డి అందరి ప్రేమను గెలవలేకపోయింది అనే బాధలో మాలో ఉంది" అని చిత్ర యూనిట్ చెబుతోంది.
నిర్మాత మదన్ ఈ ఫెయిల్యూర్ మీట్‌లో మాట్లాడుతూ... "మా సినిమా చూసిన వారందరూ అభినందిస్తున్నారు. కానీ ఈ ఫెయిల్యూర్ మీట్ చూసి అందరు నాది అహంభావం అనుకోవచ్చు. కానీ లవ్ రెడ్డి సినిమా చూసిన వాళ్లందరి లవ్‌ను లవ్ రెడ్డి గెలిచాడు. కానీ ఎవరైతే చూడలేదో వాళ్ల ప్రేమకు దగ్గర కావాలని చేసే ప్రయత్నమే ఈ సినిమా ఫెయిల్యూర్ మీట్. ఈ ఫెయిల్యూర్ మీట్ మాకు కొత్తగా అనిపించింది. నిర్మాతగా మేము రీచ్ కాలేకపోయాం. కానీ దర్శకుడు, హీరోకు మంచి పేరు వచ్చింది. తెలుగు సినీ పరిశ్రమలో ఫెయిల్యూర్ మీట్ పెట్టి డేరింగ్ స్టెప్ తీసుకున్న నిర్మాతను నేనే. ఎదో ఒక వండర్ చేయకపోతే నా గురించి అందరికీ తెలియదు" అన్నారు.
అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి, జ్యోతి మదన్, యన్.టి. రామస్వామి, గణేశ్, పల్లవి తదితరులు నటించిన లవ్ రెడ్డి ఈ చిత్రానికి స్మరణ్ రెడ్డి దర్శకుడు. సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.