Sridhar Babu: సీఎం రేవంత్ రెడ్డి మానస పుత్రిక ఫోర్త్ సిటీలో కాలుష్యం వెలువడని సిటీ నిర్మాణం: మంత్రి శ్రీధర్ బాబు
- ఫోర్త్ సిటీలో గోల్ఫ్ సిటీ ఏర్పాటుకు ముందుకొచ్చిన పీజీఏ సంస్థ
- 200 ఎకరాల్లో గోల్ఫ్ కోర్సును ఏర్పాటు చేసేందుకు పీజీఏ ముందుకొచ్చిందన్న మంత్రి
- దీని ద్వారా 10 వేల మందికి ఉపాధి లభిస్తుందన్న మంత్రి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానస పుత్రిక ఫోర్త్ సిటీలో ఎలాంటి కాలుష్యం వెలువడని జీరో పొల్యూషన్ సిటీని నిర్మిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఫోర్త్ సిటీలో గోల్ఫ్ సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రొఫెషనల్ గోల్ఫర్స్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా (పీజీఏ) స్థానిక భాగస్వామి స్టోన్ క్రాఫ్ట్తో కలిసి ముందుకొచ్చిందని ఆయన వెల్లడించారు. ఈరోజు సచివాలయంలో పీజీఏ, స్టోన్ క్రాఫ్ట్ ప్రతినిధులు మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు.
ప్రభుత్వం సహకరిస్తే గోల్ఫ్ కోర్టులు, నివాస సముదాయాలు, హోటళ్లు, వినోద పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పీజీఏ, స్టోన్ క్రాఫ్ట్ సంస్థలు మంత్రికి తెలిపాయి. ప్రస్తుతం ముంబైలో షాపూర్జీ పల్లోంజీ సంస్థతో కలిసి గోల్ఫ్ సిటీ నిర్మిస్తున్నట్లు పీజీఏ ప్రతినిధులు వెల్లడించారు.
సుమారు 200 ఎకరాల్లో గోల్ఫ్ కోర్సును ఏర్పాటు చేయడానికి పీజీఏ కన్సార్టియం ముందుకొచ్చిందని, నిర్మాణం పూర్తైతే సుమారు 10 వేల మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి అన్నారు.