Cyclone Dana: బంగాళాఖాతంలో 'దానా' తుపాను... ఏపీలో మళ్లీ వర్షాలు
- రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం
- తుపానుగా మారే అవకాశం ఉందన్న ఆర్ఎంసీ
- వాయవ్య దిశగా పయనిస్తుందని వెల్లడి
బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా, ఆపై తుపానుగా మారనుందని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ సంస్థ (ఆర్ఎంసీ) వెల్లడించింది. ఈ తుపానుకు 'దానా' అని నామకరణం చేసినట్టు తెలిపింది.
రాగల 24 గంటల్లో ఉత్తర అండమాన్ సముద్రాన్ని ఆనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని ఆర్ఎంసీ వివరించింది. ఇది వాయవ్య దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశిస్తుందని పేర్కొంది.
కాగా, ఈ అల్పపీడనం అక్టోబరు 22 నాటికి వాయుగుండంగా, అక్టోబరు 23 నాటికి తుపానుగా మారే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది.
ఈ నెల 25న కోస్తాంధ్ర, యానాంలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు... ఈ నెల 20, 24 తేదీల్లో కోస్తాంధ్ర, యానాంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు... ఈ నెల 20న రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది.
సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు ఈ నెల 21 కల్లా తిరిగొచ్చేయాలని సూచించింది.