Sonia Gandhi: కుమార్తె కోసం ఎన్నికల ప్రచారం చేయనున్న సోనియా గాంధీ

Sonia Gandhi will campaign for daughter Priyanka Gandhi in Wayanad
  • ఇటీవల ఎన్నికల్లో వయనాడ్, రాయ్ బరేలి నుంచి నెగ్గిన రాహుల్
  • వయనాడ్ సీటును వదులుకున్న కాంగ్రెస్ అగ్రనేత
  • నవంబరు 13న ఉప ఎన్నిక
  • కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్న ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వయనాడ్ లోక్ సభ స్థానం ఉప ఎన్నికలో పోటీ చేస్తుండడం తెలిసిందే. ఇటీవలి ఎన్నికల్లో రాహల్ గాంధీ వయనాడ్, రాయ్ బరేలి రెండు చోట్ల గెలుపొందారు. దాంతో ఆయన వయనాడ్ సీటును వదులుకోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానంలో రాహుల్ సోదరి ప్రియాంక గాంధీని బరిలో దింపాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. 

వయనాడ్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక పేరును ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో, తన కుమార్తె ప్రియాంక గాంధీ కోసం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ స్వయంగా ఎన్నికల ప్రచారానికి తరలిరానున్నారు. 

ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం ప్రియాంక గాంధీకి ఇదే తొలిసారి కావడంతో, కాంగ్రెస్ నాయకత్వం వయనాడ్ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. వయనాడ్ లో నవంబరు 13న పోలింగ్ జరగనుంది. నవంబరు 23న ఫలితాలు వెల్లడించనున్నారు. 

ఈ నేపథ్యంలో, ప్రియాంక తరఫున ప్రచారం చేసేందుకు సోనియా కేరళ రానున్నారు. సోనియా చాన్నాళ్ల తర్వాత కేరళ వస్తుండడంతో రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో ఉత్సాహం నెలకొంది. సోనియా... తన కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీతో కలిసి ఎల్లుండి (అక్టోబరు 22) వయనాడ్ లో భారీ రోడ్ షోలో పాల్గొంటారు. ఈ రోడ్ షోను విజయవంతం చేయడానికి రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి.

కాగా, వయనాడ్ లో ప్రియాంక గాంధీపై బీజేపీ యువ నేత నవ్య హరిదాస్ ను బరిలో దించుతోంది.
Sonia Gandhi
Priyanka Gandhi
Wayanad
By Polls
Congress
Kerala

More Telugu News