Jammu And Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల పాశవిక దాడి.. ఒక డాక్టర్, ఆరుగురు కార్మికుల మృతి
- సొరంగ నిర్మాణ కార్మికుల క్యాంప్‌పై కాల్పులు
- ఏడుగురి మృతి.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు
- ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండించిన సీఎం ఒమర్ అబ్దుల్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా
జమ్మూకశ్మీర్‌లోని గందర్బాల్ జిల్లా గుండ్ ప్రాంతంలో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఓ నిర్మాణ సైట్లో ఉన్న కార్మికుల క్యాంప్‌పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక డాక్టర్‌తో పాటు ఆరుగురు కార్మికులు చనిపోయారు. మరో ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
కాగా బాధిత కార్మికులంతా గగంగీర్ వద్ద నిర్మిస్తున్న జెడ్- మోడ్ టన్నెల్ నిర్మాణ పనులు చేస్తున్నారు. కార్మికులు అందరూ స్థానికేతరులేనని, అందరూ ఒక ప్రైవేటు నిర్మాణ కంపెనీకి చెందినవారేనని పోలీసులు తెలిపారు. ఆదివారం సాయంత్రం ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని చెప్పారు. ఉగ్రవాదులు మెరుపు వేగంతో దాడి చేశారని వివరించారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు వేట మొదలుపెట్టాయని పోలీసులు తెలిపారు.
కాగా ఈ దాడిని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండించారు. అమాయక కార్మికులపై జరిపిన దాడి ఒక పాపమని, పిరికిపంద చర్య అని ఆయన అభివర్ణించారు. బాధిత కార్మికులు భాగమైన ప్రాజెక్ట్ అవసరాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. నిరాయుధులైన వ్యక్తులపై దాడి దారుణమని అన్నారు. మృతులు, గాయపడిన వారి కుటుంబాలకు తన సానుభూతిని తెలిపారు. స్థానికేతర కార్మికులకు న్యాయం, భద్రత అందిస్తామని ఆయన చెప్పారు. మరో పక్క ఈ ఉగ్రదాడిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మరో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఖండించారు.