Roja: చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, బాలకృష్ణలపై రోజా విమర్శలు
- రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయన్న రోజా
- బాధిత కుటుంబాలకు ప్రభుత్వం భరోసా ఇవ్వలేకపోతోందని విమర్శ
- షూటింగులు చేసుకునే వారికి రాజకీయాలు ఎందుకని ప్రశ్న
కూటమి పాలనలో ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా అన్నారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం కనీస భరోసాను కూడా ఇవ్వలేకపోతోందని విమర్శించారు. మహిళలపై జరుగుతున్న దాడులు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు, మంత్రి నారా లోకేశ్ కు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఇందుకేనా ప్రజలు మీకు ఓటు వేసిందని అడిగారు.
రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోతుంటే హోం మంత్రి అనిత వెటకారంగా మాట్లాడుతున్నారని రోజా మండిపడ్డారు. దిశ యాప్ ఉంటే అభాగ్యులకు న్యాయం జరిగేదని... కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దిశ యాప్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో 74 మందికి పైగా ఆడపిల్లలపై అత్యాచారాలు, హత్యలు జరిగాయని అన్నారు.
మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు వెళ్లి 'అన్ స్టాపబుల్' షోలో పాల్గొన్నారని రోజా విమర్శించారు. బాలకృష్ణ, పవన్ కల్యాణ్ సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నారని చెప్పారు. సినిమా షూటింగులు చేసుకునే వారికి రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టాలని, ఓట్లు వేసిన ప్రజలకు రక్షణగా నిలవాలని సూచించారు.