Heavy Rain: అక్టోబరు 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

Heavy rain alert for North Andhra
  • బంగాళాఖాతం-అండమాన్ సముద్రంలో అల్పపీడనం
  • ఎల్లుండికి తుపానుగా మారుతుందన్న ఏపీఎస్డీఎంఏ
  • అక్టోబరు 24 నాటికి ఒడిశా-బెంగాల్ తీరాలకు చేరువగా వస్తుందని వెల్లడి
తూర్పు మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రంలో ఇవాళ తెల్లవారుజామున అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రేపటికి వాయుగుండంగా మారుతుందని, అక్టోబరు 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని వివరించింది. 

ఈ తుపాను వాయవ్య దిశగా పయనిస్తుందని, అక్టోబరు 24 ఉదయం ఒడిశా-బెంగాల్ తీరాలకు అనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. 

దీని ప్రభావంతో అక్టోబరు 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

అల్పపీడనం కారణంగా సముద్రం అలజడిగా ఉంటుందని... అక్టోబరు 22 నుంచి 25 వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని, సముద్రంలో ఇప్పటికే వేటకు వెళ్లిన వారు వెంటనే తీరానికి చేరుకోవాలని ఏపీఎస్డీఎంఏ స్పష్టం చేసింది. 

ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ సూచించారు.
Heavy Rain
North Andhra
APSDMA
Cyclone

More Telugu News