Pawan Kalyan: నా తరఫున మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ప్రకటిస్తున్నా: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో డయేరియా మరణాలు
- జిల్లా కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించిన పవన్
- విచారణ కోసం సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్ నియామకం
- నివేదిక వచ్చాక ప్రభుత్వ పరిహారంపై ప్రకటన ఉంటుందని వెల్లడి
విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో డయేరియా మరణాలు నమోదైన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ గుర్ల గ్రామంలో పర్యటించారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో డయేరియా వ్యాప్తిపై విచారణకు సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్ ను నియమించినట్టు వెల్లడించారు. విచారణ తర్వాత ప్రభుత్వం నుంచి పరిహారం ప్రకటిస్తామని తెలిపారు. తన తరఫున మృతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ప్రకటిస్తున్నానని వివరించారు.
గుర్ల గ్రామానికి వెళ్లే చంపావతి నీరు కలుషితమైందని వెల్లడించారు. గత ప్రభుత్వ తప్పిదాలు తమకు వారసత్వంగా వచ్చాయని అన్నారు. గత ప్రభుత్వం కనీసం మంచి నీరు అందించలేకపోయిందని విమర్శించారు.