KTR: రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మంత్రులే కూలుస్తారని బండి సంజయ్ బాధపడుతున్నారు: కేటీఆర్ ఎద్దేవా
- రేవంత్ రెడ్డికి బండి సంజయ్ రహస్య స్నేహితుడని విమర్శ
- విద్యుత్ బిల్లుల పేరుతో భారం మోపే అవకాశముందన్న కేటీఆర్
- గ్రూప్ 1 విద్యార్థులు కోరితే తాము కోర్టులో కేసు వేశామన్న కేటీఆర్
- జర్నలిస్టులను తాను అవమానించానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ రహస్య స్నేహితుడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మంత్రులే కూల్చేస్తారంటూ బండి సంజయ్ బాధపడిపోతున్నాడని ఎద్దేవా చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై దాడులు జరిగి 20 రోజులైనా ఎవరూ మాట్లాడటం లేదన్నారు. కర్ణాటకలో తమ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేస్తోందని అక్కడి సీఎం సిద్ధరామయ్య చెబుతున్నారని, ఇక్కడ మాత్రం బీజేపీ, కాంగ్రెస్ రహస్య స్నేహాన్ని కొనసాగిస్తున్నాయని ఆరోపించారు.
మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కర్ణాటకలో అంతపెద్ద వాల్మీకి స్కాం జరిగి... అందులో తెలంగాణ కాంగ్రెస్ నేతల హస్తం ఉంటే ఇప్పటి వరకు ఒక్క అరెస్ట్ ఎందుకు జరగలేదో చెప్పాలన్నారు. అమృత్ స్కాంలో సీఎం బావమరిదికి కాంట్రాక్ట్ ఇచ్చి అవినీతి చేస్తున్నారని తాను కేంద్రమంత్రికి లేఖ రాసినా ఇప్పటికీ స్పందించలేదన్నారు. ఎవరికి ఎవరు దోస్తులో ప్రజలకు అ న్నీ తెలుసని వ్యాఖ్యానించారు. అవసరమైనప్పుడు అన్ని బయటపడతాయన్నారు.
విద్యుత్ బిల్లుల పేరుతో భారం మోపే అవకాశం
ప్రజలపై భారీగా విద్యుత్ బిల్లుల పేరుతో భారం మోపనున్నట్లు తమకు సమాచారం అందిందన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచాలంటూ 9 ప్రతిపాదనలు ఏవైతే డిస్కంలు చేశాయో వాటిని విరమించుకోవాలని ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిటీ ఛైర్మన్‌ను కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. ఇళ్లలో వాడుకునే కరెంట్‌కు సంబంధించి నెలకు రూ.300 యూనిట్లు దాటితే ఫిక్స్ డ్ ఛార్జీలు రూ.10 నుంచి ఏకంగా రూ.50 పెంచాలని ప్రతిపాదన చేశారని మండిపడ్డారు. ఇది అతి ప్రమాదకరమైన ప్రతిపాదన అన్నారు. ఈ ఒక్క నిర్ణయం మొత్తం ప్రజల ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లోకి నెడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
సామాన్యుల గృహాలకు సంబంధించి భారీగా విద్యుత్ బిల్లుల భారం పడనుందన్నారు. పరిశ్రమలన్నింటినీ ఒకే కేటగిరీ అనే ప్రతిపాదన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చాలా అసంబద్ధమైన, సిల్లీ ఆలోచన అన్నారు. ఇది పరిశ్రమలకు తీవ్ర అన్యాయం చేసే నిర్ణయమన్నారు. దేశంలో ఎప్పుడూ లేని విధంగా ఇలాంటి పిచ్చి ఆలోచన చేస్తున్నారని ధ్వజమెత్తారు. పరిశ్రమలన్నింటికీ ఒకే టారిఫ్ చేసే విధంగా చేయటమంటే అది రాష్ట్ర ప్రగతికి గొడ్డలి పెట్టుగా మారుతుందని హెచ్చరించారు.
ఇప్పటికే రాష్ట్రంలో పారిశ్రామిక రంగం మందగమనంలో ఉందని, ఫాక్స్‌కాన్ సంస్థ కూడా కంపెనీ విస్తరణకు సంబంధించి ఏమీ చెప్పటం లేదన్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రా అంటున్నారని... కానీ మన తెలంగాణ పేరు చెప్పటం లేదన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేన్స్ సహా కొన్ని పరిశ్రమలు వేరే రాష్ట్రాలకు తరలిపోయాయన్నారు. ప్రభుత్వ అసంబద్ధమైన నిర్ణయాల కారణంగానే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టాలన్న అంశానికి సంబంధించి కూడా ఈ ప్రభుత్వం ఏమీ చెప్పటం లేదన్నారు.
విద్యుత్ సరఫరా విషయంలో ఇప్పటికే ప్రజలు విసిగిపోయి ఉన్నారన్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా డిస్కంలు ఛార్జీలు పెంచాలని ప్రతిపాదన చేశాయని గుర్తు చేశారు. ట్రూ అప్ ఛార్జీలు రూ.12 వందల కోట్లు కావాలంటే తామే భరిస్తామని అప్పుడు కేసీఆర్ చెప్పి... ప్రజల మీద భారం పడకుండా చేశారన్నారు. విద్యుత్‌ను తాము కేవలం వ్యాపార వస్తువుగా చూడలేదని, అది సామాన్యుడి జీవితంలో దైనందిన అవసరంగా భావించినట్లు చెప్పారు. అందుకే తాము రైతులకు ఉచిత విద్యుత్‌ను అందించామని, 24 గంటల కరెంట్ ఇచ్చామన్నారు.
నాయి బ్రహ్మణులు, రజకులకు ఉచిత కరెంట్ ఇచ్చామని, దళితులకు ఉచిత కరెంట్ ఇచ్చే ప్రయత్నం చేశామన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాడు 7 వేల మెగావాట్ల సామర్థ్యం ఉంటే దానిని 24 వేల మెగావాట్లకు తీసుకువెళ్లామన్నారు. విద్యుత్ ఛార్జీలను పెంచితే అది రాష్ట్ర ప్రగతికి గొడ్డలి పెట్టుగా మారుతుందని హెచ్చరించారు. విద్యుత్ ఛార్జీల పెంపు అనేది రాష్ట్ర అభివృద్ధి అంశంతో ముడిపడి ఉందన్నారు. సిరిసిల్లలో పవర్ లూమ్ పరిశ్రమ, కాటేదాన్‌లో పరిశ్రమలకు 50 శాతం సబ్సిడీ ఇచ్చామన్నారు. తాజా ప్రతిపాదనలతో వారికి సబ్సిడీ లేకుండా పోతుందని వాపోయారు.
అడ్డగోలుగా ఛార్జీలు పెంచుతామంటే అంగీకరించవద్దని ఈఆర్సీ ఛైర్మన్‌ను కోరినట్లు చెప్పారు. ఈ నెల 23న పబ్లిక్ హియరింగ్‌లో పాల్గొనాలని ఈఆర్సీ ఛైర్మన్ కోరారని, ప్రజలకు అవగాహన కల్పించేందుకు రెండు రోజుల ముందే ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళుతున్నామన్నారు. ప్రభుత్వ ఆనాలోచిత నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ 23న హియరింగ్స్‌లో తమ వాదనలు వినిపిస్తామన్నారు. అశోక్ నగర్ వెళ్లకుండా తనను అడ్డుకుంటే.. పిల్లలే తెలంగాణ భవన్‌కు వచ్చి తనను కలిశారని వెల్లడించారు.
వారు కోరితేనే కేసు వేశాం
విద్యార్థులు కోరడంతోనే తామే కపిల్ సిబాల్ లాంటి లాయర్‌ను పెట్టి సుప్రీంకోర్టులో కేసు వేశామన్నారు. శుక్రవారమే విచారణ జరుగుతుందని భావించామని, కానీ సోమవారం విచారణకు తీసుకున్నారని తెలిపారు. సుప్రీంకోర్టు తాము లేవనెత్తిన ఏ అంశాన్ని వ్యతిరేకించలేదన్నారు. జీవో 29పై తీర్పు వచ్చే వరకు ఫలితాలు ఇవ్వవద్దని తెలిపిందని, విచారణ కూడా వేగంగా జరపాలని కోరిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లకు అనుగుణంగా తాము జీవో నంబర్ 552ను తీసుకువచ్చామన్నారు. ఓపెన్ కోటాలో కూడా మెరిట్ ప్రకారం అందరికీ అవకాశం కల్పించామన్నారు.
జీవో 29 ఓపెన్ కోటాను కూడా రిజర్వ్ చేసేలా ఉంది
జీవో 29 అనేది ఓపెన్ కోటాను కూడా రిజర్వ్ చేసేలా ఉందన్నారు. ఫిబ్రవరి నుంచే తాము ఇది అన్యాయమైన జీవో అని చెబుతూ వస్తున్నామన్నారు. గ్రూప్-1కు మెయిన్స్ పరీక్ష రాసే పిల్లలకు ప్రశాంతమైన వాతావారణం లేకుండా చేశారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం వాళ్లను బతకనివ్వకుండా ఎగ్జామ్‌కు వారం రోజుల ముందు ఇబ్బందులు పెట్టిందని ఆరోపించారు. కోర్టు కేసు తేలేదాక తాము విద్యార్థులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జీవో 29 రాజ్యాంగ విరుద్ధమని చెప్పటం తప్పా? అని నిలదీశారు. స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లను కేసీఆర్ తెచ్చారని, కానీ దాంట్లో నాన్ లోకల్స్ వచ్చేలా కుట్రలు చేస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారన్నారు. నాడు రాహుల్ గాంధీ అశోక్ నగర్ వస్తే సెక్యూరిటీ కల్పించామని, కానీ ఇప్పుడు మాత్రం తమను అరెస్ట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
తెలుగు అకాడమీ ప్రామాణికం కాదని చెబితే ఎలా అని నిలదీశారు. ఈ అన్ని అంశాలు తేలే వరకు ఎగ్జామ్స్ రీ-షెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి తన చర్య ద్వారా బలహీన వర్గాలపై ఉన్న వ్యతిరేకతను చాటుకున్నారన్నారు. జీవో 29 ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను ఎత్తివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణేతరులకు కూడా ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయోజనాలు కల్పించే కుట్ర చేస్తోందన్నారు. పరీక్షల విషయంలో ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 29 విషయంలో న్యాయవాదిని పెట్టి విద్యార్థుల తరఫున కొట్లాడుతామన్నారు. ప్రభుత్వం బేషజాలకు పోవద్దని, ప్రజాస్వామ్యంలో ఎక్కడ తగ్గాలో... ఎక్కడ నెగ్గాలో తెలిసి ఉండాలన్నారు.
తాను జర్నలిస్ట్‌లను అవమానించానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు పెద్ద ఎత్తున రాజకీయ అవకాశాలు కల్పించిందే బీఆర్ఎస్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో యాజమాన్యాలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ... జర్నలిస్ట్‌లు తెలంగాణ కోసం ఎంతో కష్టపడ్డారని గుర్తు చేసుకున్నారు. అందుకే వారంటే బీఆర్ఎస్‌కు గౌరవమన్నారు.
మూసీ పేరుతో ఇంత జరుగుతుంటే ప్రశ్నించవద్దా?
తమ కళ్ల ముందే మూసీ పేరుతో ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుంటే ప్రశ్నించవద్దా? అని నిలదీశారు. మూసీ విషయంలో తమకంటే ఎక్కువ పోరాడాల్సిన బాధ్యత మీడియాదే అన్నారు. వానాకాలం రైతు భరోసాకు పైసలు లేవు కానీ మూసీలో రూ.లక్షా 50 వేల కోట్లు పోయటానికి డబ్బులున్నాయా? అని మండిపడ్డారు. అటుపై దామగుండంలో, ఇటు కింద అదానీ సిమెంట్ ఫ్యాక్టరీకి అనుమతులిచ్చి మూసీని చంపుతున్నారని, పైగా మూసీ పునరుజ్జీవనం అంటే నమ్మేది ఎలా? అన్నారు. ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుంటే నేను మాట్లాడవద్దా? అని ప్రశ్నించారు. జర్నలిస్టులపై దాడులు జరుగుతుంటే జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మూసీ లూటీని కవర్ చేసేందుకు ప్రభుత్వం ఎన్నో తంటాలు పడుతోందన్నారు. మూసీ విషయంలో ఎలాంటి లూటీ జరిగిన తాము పోరాటం చేస్తామన్నారు.
ముత్యాలమ్మ గుడి ఘటనను ఖండిస్తే...
బీఆర్ఎస్ హయాంలో ఒక్క మతఘర్షణ జరగలేదన్నారు. ముత్యాలమ్మ గుడి సంఘటనను తాను ఖండిస్తే శాంతిభద్రతల సమస్య అంటూ తనపై సైబర్ క్రైమ్ వాళ్లు ట్విట్టర్‌కు ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మత ఘర్షణలను ఖండించవద్దా? అని ప్రశ్నించారు. సీఎంకు చేతనైతే శాంతిభద్రతలను కాపాడాలన్నారు. బీఆర్ఎస్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదంటూ ముఖ్యమంత్రి చెప్పటం సిగ్గుచేటు అన్నారు. తాము లక్షా 60 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామన్నారు. అబద్ధాలు చెప్పేందుకు సీఎంకు సిగ్గులేదా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.