Jitesh Sharma: రోహిత్ శర్మ, సూర్య వీరిద్దరిలో ఎవరి కెప్టెన్సీని ఇష్టపడతావు?.. జితేష్ శర్మ సమాధానం ఇదే
- సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఆడడాన్ని ఎక్కువ ఇష్టపడతానన్న వర్ధమాన క్రికెటర్
- సూర్య భాయ్‌తో ఏదైనా స్వేచ్ఛగా మాట్లాడొచ్చని వెల్లడి
- ఒక జూనియర్‌గా రోహిత్ శర్మతో మాట్లాడడానికి భయపడతానన్న యువ ఆటగాడు
ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన వర్ధమాన క్రికెటర్లలో జితేష్ శర్మ ఒకడు. గత సీజన్ ఐపీఎల్లో అదరగొట్టి సెలక్టర్ల దృష్టిలో పడిన ఈ యువ కెరటం ఒకానొక దశలో టీ20 ప్రపంచ కప్ 2024కు ఎంపికవుతాడేమో అని ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ తృటిలో అవకాశాన్ని కోల్పోయాడు. ఇక వరల్డ్ కప్ తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకొని రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ సారధ్యాలలో మొత్తం 9 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్లో శిఖర్ ధావన్ కెప్టెన్సీలో ఆడాడు. కెప్టెన్ల కెప్టెన్సీ తీరుపై జితేష్ శర్మ మాట్లాడాడు. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సూర్యకుమార్ యాదవ్‌లలో ఎవరి కెప్టెన్సీలో ఆడడాన్ని ఎక్కువ ఇష్టపడతావని ప్రశ్నించగా అతడు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ముగ్గురూ చాలా భిన్నమైన వ్యక్తిత్వాలు ఉన్న కెప్టెన్లు అని, అయితే రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌ల కలయిక సూర్యకుమార్ యాదవ్ అని తాను భావిస్తున్నట్టు జితేష్ శర్మ చెప్పాడు.
‘‘నేను ఒక జూనియర్‌గా రోహిత్ భాయ్‌కు కొంచెం భయపడతాను. సీనియర్లతో మాట్లాడేటప్పుడు ఈ భావన కలుగుతుంది. అది సహజమేనని నేను అనుకుంటున్నాను. ఇక శిఖర్ భాయ్ చాలా ఉల్లాసంగా, రిలాక్స్డ్గా, కూల్‌గా ఉంటాడు. వీరిద్దరి కంటే సూర్య భాయ్ కెప్టెన్సీలో ఆడడం నాకు చాలా సులభం. సూర్యతో ఏదైనా చాలా స్వేచ్ఛగా మాట్లాడవచ్చు. అందుకే అతడి కెప్టెన్సీలో ఆడడానికి ఇష్టపడతాను’’ అని జితేశ్ శర్మ చెప్పాడు.
ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇకఐపీఎల్లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పంజాబ్ కింగ్స్ జట్టుకు అత్యంత కీలకమైన ఆటగాడిగా మారిపోయాడు. మిడిల్ ఆర్డర్లో అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తున్నాడు.