Sarfaraz Khan: తండ్రైన టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్
- పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సర్ఫరాజ్ భార్య రొమానా జహూర్
- చేతిలో కుమారుడితో సర్ఫరాజ్ దిగిన ఫొటో నెట్టింట వైరల్
- ఇటీవల కివీస్‌పై అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్న యువ సంచలనం
- ఇప్పుడు మగబిడ్డ జన్మించడంతో ఆనందానికి అవధుల్లేని ఖాన్ ఫ్యామిలీ
టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రయ్యాడు. అతని భార్య రొమానా జహూర్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. చేతిలో కుమారుడితో సర్ఫరాజ్ దిగిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 26 ఏళ్ల సర్ఫరాజ్‌కు 2023 ఆగస్టు 6న జమ్మూకశ్మీర్‌కు చెందిన రొమానా జహూర్‌తో వివాహమైన విషయం తెలిసిందే.
ఇక ఇటీవల ఈ యువ సంచలనం న్యూజిలాండ్‌పై అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. జట్టు క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు అమూల్యమైన 150 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో టీమిండియాలో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నట్లైంది. ఇలా ఆనందంలో ఉన్న సర్ఫరాజ్‌కు ఇప్పుడు మగబిడ్డ జన్మించడంతో ఖాన్ కుటుంబం సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.
ఇదిలాఉంటే.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్‌పై తన తొలి టెస్టు సెంచరీని సాధించిన తర్వాత సర్ఫరాజ్ ఖాన్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. శతకం నమోదు చేసిన సమయంలో తాను ఆకాశంలో ఎగురుతున్నట్లు భావించానని చెప్పాడు.
"చాలా బాగా అనిపించింది. సెంచరీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నప్పుడు గడ్డి పచ్చగా కాకుండా నీలిరంగులో ఉన్నట్లు అనిపించింది. నేను ఆకాశంలో ఉన్నట్లు ఫీలయ్యా. భారత్ తరఫున శతకం చేయాలనేది నా కల. అది నెరవేరింది’’ అని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) షేర్ చేసిన వీడియోలో సర్ఫరాజ్ పేర్కొన్నాడు.
"నేను చిన్నప్పటి నుండి విరాట్ కోహ్లీని చూస్తూ పెరిగాను. అతనితో కలిసి ఆడాలని కోరుకున్నా. ఆర్‌సీబీలో ఆ కల నెరవేరింది. కానీ అతనితో భారత జట్టులో ఆడటం అనేది చాలా ప్రత్యేకమైంది. విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ వంటి వారు వెన్ను తట్టి, మీరు బాగా ఆడారని చెప్పినప్పుడు ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పడం కష్టం. వారిద్దరూ నాకు చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చారు. అది ఖచ్చితంగా గర్వించదగ్గ విషయం" అని సర్ఫరాజ్ ఖాన్ చెప్పుకొచ్చాడు.