mp kesineni Chinni: రోజా వ్యాఖ్యలకు ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్
- కూటమి ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణ చూసి వాళ్లు ఓర్వలేకపోతున్నారన్న విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని
- గంజాయి రవాణాను ప్రోత్సహించి యువత జీవితాలను బలి చేశారని విమర్శ
- రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఒక్క సీటుకే పరిమితం కావడం ఖాయమని చిన్ని జోస్యం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి వస్తున్న ప్రజాభిమానాన్ని చూసి వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్, మాజీ మంత్రి ఆర్కే రోజా లాంటి వాళ్లు ఓర్వలేకపోతున్నారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. విజయవాడలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఆర్కే రోజా చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చినా సిగ్గు రాలేదా అంటూ ఘాటుగా విమర్శించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చూసి జనం హర్షిస్తున్నారన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని నిలువుగా ముంచేశారని, అందుకే జనం ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారన్నారు. ఇదే విధంగా ప్రవర్తిస్తే రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఒక్క సీటుకి పరిమితం కావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.
గత ఐదేళ్ల కాలంలో 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని, అయినా వైసీపీ నేతలకు అవేమీ పట్టలేదన్నారు. తమ ప్రభుత్వం వారి ఆచూకీ గుర్తించి వెనక్కి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్‌లు కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఢిల్లీలో పెద్దలను కలిసి నిధులు తెస్తున్నారని వివరించారు. రాష్ట్రాన్ని గత ఐదేళ్లుగా సర్వ నాశనం చేశారని, గంజాయి రవాణాను ప్రోత్సహించి యువత జీవితాలను బలి చేశారని మండిపడ్డారు. ఇటీవల జరిగిన దారుణాలకు ఈ గంజాయి మత్తే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. దారుణాలకు పాల్పడిన నిందితులను ప్రభుత్వం వెంటనే అరెస్టు చేస్తోందని చెప్పారు.
జగన్ హయాంలో జరిగిన దారుణాలకు ఎంత మందిని అరెస్టు చేశారని ప్రశ్నించారు. జగన్ హయాంలో తీసుకున్న నిర్ణయాలు, అవినీతి, అక్రమాలపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. అందులో భాగంగా పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి జత్వానీ కేసు విషయంలో ముగ్గురు ఐపీఎస్‌లపై సస్పెన్షన్ వేటు పడిందన్నారు. విశాఖలోని శారదా పీఠానికి జగన్ ప్రభుత్వం అప్పనంగా కట్టబెట్టిన వందల కోట్ల విలువైన భూ కేటాయింపును సైతం ఈ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. జగన్ సర్కార్‌లో జరిగిన అక్రమాలపై కూటమి ప్రభుత్వం తనదైన శైలిలో వ్యవహరిస్తూ ముందుకు వెళుతుంటే జగన్ అండ్ కో తట్టుకోలేకపోతుందని చిన్ని విమర్శించారు.