Israel: హిజ్బుల్లా బంకర్లో కళ్లు చెదిరే బంగారం.. నోట్ల కట్టలు.. వీడియో విడుదల చేసిన ఐడీఎఫ్
- లెబనాన్‌పై భీకరంగా విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్
- ఆర్థిక మూలాలను లక్ష్యంగా చేసుకుని దాడులు
- బీరుట్ నడిబొడ్డున ఆసుపత్రి కింద రహస్య బంకర్
- అందులో రూ.4,200 కోట్లు, బంగారం గుట్టలు ఉన్నట్టు ఐడీఎఫ్ అంచనా
- త్వరలోనే దానిపైనా దాడులు
లెబనాన్‌లోని హిజ్బుల్లాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ తాజాగా ఆ సంస్థ ఆర్థిక మూలాలను టార్గెట్ చేసింది. ఇందులో భాగంగా ఓ రహస్య బంకర్‌ను గుర్తించింది. ఓ ఆసుపత్రి కింద ఉన్న ఈ బంకర్లో నోట్లు, బంగారం గుట్టలుగా ఉన్నట్టు తమకు సమాచారం ఉందని పేర్కొంటూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) ఓ వీడియోను విడుదల చేసింది.
ఆ వీడియోలో ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ మాట్లాడుతూ.. హిజ్బుల్లా ఆర్థిక మూలాలపై వరుసగా దాడులు చేస్తున్నట్టు చెప్పారు. ఆదివారం రాత్రి జరిపిన దాడుల్లో ఓ బంకర్‌ను ధ్వంసం చేసినట్టు చెప్పారు. అందులో వేల డాలర్ల నగదు, బంగారాన్ని గుర్తించినట్టు తెలిపారు. ఇజ్రాయెల్‌పై దాడికి ఈ సొమ్మును ఉపయోగిస్తున్నట్టు చెప్పారు. అలాగే, బీరుట్ నడిబొడ్డున అల్-సాహెల్ ఆసుపత్రి కింద ఉన్న బంకర్లో వందల మిలియన్ల కొద్దీ డాలర్లు, బంగారం గుట్టలను గుర్తించినట్టు తెలిపారు. దానిపైనా దాడి చేయాల్సి ఉందన్నారు.
భారత కరెన్సీ ప్రకారం ఆ బంకర్లో రూ.4,200 కోట్లు (500 బిలియన్ డాలర్లు), బంగారం గుట్టలు ఉన్నాయని అంచనా వేస్తున్నట్టు హగారీ తెలిపారు. తమ యుద్ధం హిజ్బుల్లాతోనే తప్ప లెబనాన్ పౌరులతో కాదని స్పష్టం చేశారు. బంకర్ ఉన్న ఆసుపత్రిపై దాడిచేయబోమని స్పష్టం చేశారు. ఐడీఎఫ్ తాజా హెచ్చరికల నేపథ్యంలో లెబనాన్ అధికారులు ఆసుపత్రిని ఖాళీ చేయిస్తున్నట్టు తెలిసింది.