KTR: మంత్రి కొండా సురేఖపై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా: కేటీఆర్
- నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత దాడులపై పోరాటం చేస్తానన్న కేటీఆర్
- సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్య
- నిరాధార ఆరోపణలకు అడ్డూ అదుపూ లేకుండా పోయాయంటూ ఆగ్రహం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనపై నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత దాడులు చేసేవారిపై పోరాటం చేస్తానని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేటీఆర్ తాజాగా 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఒక పోస్ట్ చేశారు.
"నా పాత్రపై వ్యక్తిగత దాడులు, నిరాధార ఆరోపణలు చేసేవారిపై తప్పకుండా పోరాటం చేస్తాను. న్యాయ వ్యవస్థపై నాకు నమ్మకం ఉంది. తప్పకుండా నిజం గెలుస్తుందనే విశ్వాసం కూడా ఉంది. మంత్రి కొండా సురేఖ దురుద్దేశపూరితమైన, చౌకబారు వ్యాఖ్యలకు గాను ఆమెపై రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా వేశాను. చాలా కాలంగా నిరాధార ఆరోపణలకు అడ్డూ అదుపూ లేకుండా పోయాయి. కొంతకాలంగా సోషల్ మీడియా ద్వారా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇక నుంచి అలాంటి ఆరోపణలు చేయకుండా కట్టడి చేయాలి. నేను ఎల్లప్పుడూ వ్యక్తిగత విమర్శల కంటే ప్రజల సమస్యలకు ప్రాధాన్యత ఇస్తాను. రాజకీయ విమర్శల పేరుతో చౌకబారు ఆరోపణలు చేసేవారికి ఈ వ్యాజ్యం ఒక గుణపాఠం అవుతుందని అనుకుంటున్నాను" అని కేటీఆర్ తన ట్వీట్లో రాసుకొచ్చారు.