Etela Rajender: హైడ్రా ఉద్దేశం వేరే ఉందని నేను చెప్పిన మాటలు ప్రజలు నమ్ముతున్నారు: ఈటల రాజేందర్
- ఫతేనగర్ డివిజన్లో ఎంపీ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్
- ఢిల్లీకి వెళ్లినప్పుడు తప్ప ఎప్పుడూ నియోజకవర్గంలోనే ఉంటున్నానన్న ఈటల
- అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి నిధులు కోరినట్లు వెల్లడి
- మొదట మూసీ మురికి నీళ్లను శుద్ధి చేయాలని సూచన
హైడ్రా ఉద్దేశం వేరే ఉందని, తాను చెప్పిన ఈ మాటలను ప్రజలు ఇప్పటికీ నమ్ముతున్నారని బీజేపీ నేత, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్‌లోని ఫతేనగర్ డివిజన్లో ఈరోజు బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఈ నియోజకవర్గ ప్రజలు తనను గెలిపించి నాలుగు నెలలు దాటిందని, ఈ కాలంలో ఢిల్లీ వెళ్ళినప్పుడు తప్ప ప్రతిరోజు నియోజకవర్గంలోనే ప్రజలకు అందుబాటులో ఉంటున్నట్లు చెప్పారు.
"ఎంత తిరిగినా ఒడవని (తరగని) నియోజకవర్గం ఇది... ఎంత విన్నా ఒడవని (తరగని) గాథ ఉంది ఇక్కడ" అన్నారు. కలెక్టర్‌ను, హెచ్ఎండిఏ కమిషనర్‌ను, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఎండిని... ఇలా అందరినీ వివిధ అభివృద్ధి పనులపై కలిశామని, ఎమ్మెల్యేలతో కలిసి అధికారుల వద్దకు వెళ్లినట్లు తెలిపారు. కేంద్రంలో అర్బన్ డెవలప్మెంట్ మంత్రిని కూడా కలిసి స్వచ్ఛ భారత్, స్మార్ట్ సిటీ కింద డబ్బులు కోరినట్లు చెప్పారు.
చెరువుల్లోకి మురుగునీరు వెళ్లకుండా... దారి మళ్లించేందుకు గతంలో 'స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ కార్యక్రమాన్ని తీసుకు వచ్చారని, ఈ కార్యక్రమానికి కొన్ని నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరినట్లు వెల్లడించారు.
మూసీ ప్రక్షాళన విషయం తర్వాత చూసుకోవచ్చు... ముందు మురికి నీళ్లను శుద్ధి చేయాలని ప్రభుత్వానికి సూచించారు. రసాయన వ్యర్థాలను శుద్ధి చేస్తేనే మూసీ బాగుపడుతుందని పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని, కానీ చేస్తున్న పద్ధతికి మాత్రం వ్యతిరేకమే అన్నారు. సమస్యలపై తాము కొట్లాడుతున్నప్పుడు ప్రజల సహకారం ఉండాలన్నారు.