Priyanka Gandhi: ప్రియాంక గాంధీ కంటే నాకే అనుభవం ఎక్కువ!: వయనాడ్ బీజేపీ అభ్యర్థి నవ్య
- తాను రెండుసార్లు కౌన్సిలర్‌గా గెలిచానన్న నవ్య హరిదాస్
- ప్రియాంక గాంధీకి ఇదే మొదటి ఎన్నిక అని వెల్లడి
- ప్రియాంక గాంధీపై విజయం సాధిస్తానని ధీమా
- నెహ్రూ కుటుంబ నేపథ్యం కారణంగా ప్రియాంక నాయకురాలయ్యారన్న నవ్య
ప్రజాప్రతినిధిగా ప్రియాంకగాంధీ కంటే తనకే అనుభవం ఎక్కువ అని వయనాడ్ బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ అన్నారు. వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ప్రియాంక, బీజేపీ నుంచి నవ్య పోటీ చేస్తున్నారు. నవ్య ఇవాళ కల్పేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమయంలో పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ప్రియాంక గాంధీపై తాను తప్పకుండా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
నెహ్రూ కుటుంబం నేపథ్యంతో ప్రియాంకగాంధీ జాతీయస్థాయి నాయకురాలు అయ్యారని, కానీ ఇది ఆమెకు మొదటి ఎన్నిక అని గుర్తు చేశారు. కానీ తాను మాత్రం కోజికోడ్ కార్పోరేషన్లో రెండుసార్లు వరుసగా కౌన్సిలర్‌గా విజయం సాధించానని, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశానని తెలిపారు.
తాను చాలా ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్నానని తెలిపారు. కాబట్టి ప్రియాంక గాంధీపై పోటీ తనకు భిన్నంగా ఏమీ అనిపించడం లేదన్నారు. పైగా ప్రజా జీవితంలో ఆమె కంటే తనకే అనుభవం ఎక్కువ అన్నారు. ఇక్కడ పోరు బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ బాధ్యతారాహిత్యం కారణంగా ఎన్నికలు వచ్చాయని విమర్శించారు.
లోక్ సభ ఎన్నికలు ఇటీవలే పూర్తయ్యాయని, వయనాడ్‌లో రాహుల్ గాంధీ కోసం ఓట్లు అడుగుతూ వెలిసిన ఫ్లెక్సీలు ఇప్పటికీ కనిపిస్తున్నాయని.. కానీ అప్పుడే ఆయన రాజీనామా చేసి, ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారని చురక అంటించారు. తన సోదరిని బరిలోకి దింపడం ద్వారా మరోసారి వారు కుటుంబ ఆధిపత్యాన్ని చూపించారన్నారు. ఇదే అంశాన్ని తాము ఓటర్లలోకి తీసుకు వెళతామన్నారు.
బీజేపీ అజెండా అభివృద్ధి మాత్రమే అన్నారు. 2019 లోక్ సభ ఎన్నికలతో పోలిస్తే గత ఎన్నికల్లో బీజేపీకి పడిన ఓట్లు రెండింతలు అయ్యాయన్నారు. అదే సమయంలో 2019 కంటే రాహుల్ గాంధీకి పడిన ఓట్లు భారీగా తగ్గాయన్నారు. దీనికి తోడు ఇటీవల హర్యానాలో బీజేపీ గెలిచిందని, జమ్ము కశ్మీర్లో బీజేపీకి మంచి సీట్లు వచ్చాయని గుర్తు చేశారు. వీటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారన్నారు.