Vangalapudi Anitha: ఇలాంటి వాళ్లు కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడడం సిగ్గుచేటు: హోంమంత్రి అనిత

Home minister Anitha slams YCP leaders over law and order
  • ఇటీవల అత్యాకోడళ్లపై అత్యాచారం
  • బద్వేలులో ప్రేమోన్మాది చేతిలో ఇంటర్ విద్యార్థిని బలి
  • కూటమి ప్రభుత్వ పెద్దలను లక్ష్యంగా చేసుకున్న వైసీపీ నేతలు
  • రేపు బద్వేలులో ఇంటర్ విద్యార్థిని కుటుంబీకులకు జగన్ పరామర్శ
  • వైసీపీ విమర్శలకు నేడు ఘాటుగా బదులిచ్చిన హోంమంత్రి అనిత
అత్తాకోడళ్లపై అత్యాచారం, బద్వేలులో ప్రేమోన్మాది చేతిలో ఇంటర్ విద్యార్థిని హత్యకు గురికావడం వంటి అంశాల్లో వైసీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శిస్తుండడం తెలిసిందే. సీఎం చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను, మంత్రి నారా లోకేశ్ ను, హోంమంత్రి అనితను  వైసీపీ నేతలు లక్ష్యంగా చేసుకుని వాగ్బాణాలు విసురుతున్నారు. 

అంతేకాదు, వైసీపీ అధినేత జగన్ రేపు బద్వేలు వెళ్లి ఇంటర్ విద్యార్థిని కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. దీనిపై ఏపీ హోంమంత్రి అనిత స్పందించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో అనిత మీడియా సమావేశం నిర్వహించారు. 

నేరస్థులు, నేర చరిత్ర కలిగినవారు అధికార ముసుగులో వ్యవస్థల్ని దుర్వినియాగం చేసిన వారు కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. చంద్రబాబు తన విజన్ తో పోలీస్ వ్యవస్థతో సహా వ్యవస్థలన్నిటినీ పునరుద్ధరిస్తుంటే... బాబాయిని చంపించిన వారు, గత ఐదేళ్లలో మహిళలపై జరిగిన వేల నేరాలపై స్పందించని పులివెందుల ఎమ్మెల్యే గారు ఇప్పుడు మాట్లాడుతున్నారన్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. 

"2014-2019 మధ్య కాలంలో చంద్రబాబు శాంతిభద్రతలు, రక్షణ కోసం టెక్నాలజీని ఉపయోగించేలా పోలీస్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చారు. 2014-2019 మధ్య CCTNS లో డేటా అప్ లోడ్ చేయడంలో ఏపీ దేశంలోనే నెంబర్ వన్ గా ఉంది. 

జన సమూహం ఎక్కువగా ఉండే చోట ఫింగర్ ప్రింట్స్ సిస్టం కిట్ తో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులని  గుర్తించటం సులువయ్యేది. జగన్ వచ్చాక ఫింగర్ ప్రింట్స్ సిస్టం నిర్వహణ కోసం ఐదేళ్ల కాలానికి రూ.10 కోట్లు ఖర్చు పెట్టకుండా ఆ వ్యవస్థని మూలన పెట్టేశారు. అలాంటి వ్యక్తి ఈ రోజు శాంతి భద్రతల గురించి మాట్లాడటం సిగ్గు చేటు. 

జగన్ రెడ్డి హయాంలో నడిరోడ్డు మీద హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగేవి. జగన్ రెడ్డి ఇంటికి కూత వేటు దూరంలో గంజాయి బ్యాచ్ అత్యాచారం చేస్తే ఒక్క మాట మాట్లాడలేదు. జగన్ రెడ్డి పాలనలో NCRB నివేదిక ప్రకారం మహిళలు, చిన్నారుల మీద 2,04,418 నేరాలు నమోదయ్యాయి. ఐదేళ్లపాటు జరిగిన నేరాలలో ఒక్క సంఘటనపై మాట్లాడని వ్యక్తి ఇప్పుడు శవ రాజకీయం కోసం ప్రాకులాడడానికి సిగ్గు పడాలన్నారు. 

21 రోజుల్లో శిక్ష అంటూ చట్టబద్ధత లేని దిశా చట్టంతో హడావిడి చేసి 2018 లో టీడీపీ ప్రభుత్వం పెట్టిన 'ఫోర్త్ లయన్' యాప్ పేరు మర్చి దిశా యాప్ అని చెప్పి మగవాళ్లతో కూడా డౌన్ లోడ్ చేయించారు. దిశా యాప్ లేకపోవటం వల్లనే నేరాలు అని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. మరి మీ హయాంలో దిశా యాప్ ఉన్నప్పుడు అన్ని అఘాయిత్యాలు ఎలా జరిగాయి? 

గత ఐదేళ్లుగా పోలీసులని నేరాల అదుపు చేయడం కోసం కాకుండా తెలుగుదేశం, జనసేన నాయకులని వేధించడం కోసం ఉపయోగించారు. జగన్ రెడ్డీ... మీ హయాంలో మీ నియోజకవర్గంలో నాగమ్మ, రమ్య,  అనూష, శ్రీ లక్ష్మి ఇంత మందిపై అఘాయిత్యాలు జరిగినప్పుడు ఎందుకు పరామర్శించలేదు? ఇప్పుడు శవ రాజకీయం చేయడం కోసం కూటమి ప్రభుత్వంపై బురద జల్లడానికి పరామర్శలకు వెళుతున్నారా? 

రమ్య హత్య జరిగినప్పుడు పరామర్శకు వెలుతుంటే లోకేశ్ ను, నన్నూ అడ్డుకుని ఇబ్బందులు పెట్టారు. బెంగళూరులో రెస్ట్ తీసుకుంటూ అప్పుడప్పుడు రాష్ట్రానికి విజిటింగ్ కు వచ్చే జగన్... చంద్రబాబు గురించి, లోకేశ్ గురించి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం సిగ్గు చేటు!" అంటూ అనిత ధ్వజమెత్తారు.

Vangalapudi Anitha
Chandrababu
Jagan
Nara Lokesh
Pawan Kalyan
TDP-JanaSena-BJP Alliance
YSRCP

More Telugu News