Mahesh Kumar Goud: సీనియర్ నేత జీవన్ రెడ్డి విమర్శలపై స్పందించిన టీపీసీసీ చీఫ్

TPCC chief Mahesh Kumar Goud on Jeevan Reddy comments
  • అనుచరుడు హత్యకు గురికావడంతో ఆవేదనతో మాట్లాడారన్న మహేశ్ కుమార్ గౌడ్
  • జీవన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడినట్లు టీపీసీసీ చీఫ్ వెల్లడి
  • హంతకుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడని వెల్లడి
తన అనుచరుడు హత్యకు గురికావడంతో పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి లోనై పార్టీ గురించి అలా మాట్లాడారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. తన అనుచరుడు గంగారెడ్డి హత్యకు గురి కావడంతో జీవన్ రెడ్డి సొంత పార్టీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇక పార్టీలో ఉండలేనని వ్యాఖ్యానించారు. మీడియాతో మాట్లాడుతుండగా మహేశ్ కుమార్ గౌడ్ ఫోన్ చేయగా... ఆ కాల్ ను జీవన్ రెడ్డి మధ్యలోనే కట్ చేశారు.

జీవన్ రెడ్డి అసంతృప్తిపై మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఆయన బాధలో ఉండి ఆవేదన వ్యక్తం చేశారన్నారు. జీవన్ రెడ్డితో తాను ఫోన్లో మాట్లాడానని, ఆ తర్వాత పోలీసులతోనూ మాట్లాడానన్నారు. హత్యకు సంబంధించి సమాచారం తీసుకున్నట్లు తెలిపారు. హంతకుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడని, విచారణ జరిపి నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. ఈ వ్యవహారాన్ని మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగించామన్నారు.
Mahesh Kumar Goud
Telangana
Congress

More Telugu News