Bengaluru: కుండపోత వర్షం కారణంగా బెంగళూరులో కుప్పకూలిన భారీ బిల్డింగ్
- వారం రోజులుగా బెంగళూరులో భారీ వర్షాలు
- బాబుసాపాళ్యలో కుప్పకూలిన భారీ బిల్డింగ్
- నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం
గత వారం రోజులుగా బెంగళూరులో వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు కురిసిన భారీ వర్షంతో బెంగళూరు అతలాకుతలం అయింది. గత 27 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షం ఈరోజు కురిసింది. భారీ వర్షం కారణంగా నిర్మాణంలో ఉన్న ఒక భారీ బిల్డింగ్ కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదం తూర్పు బెంగళూరులోని బాబుసాపాళ్యలో చోటుచేసుకుంది. ప్రమాద స్థలికి చేరుకున్న రెస్క్యూ టీమ్ శిథిలాలలో చిక్కుకున్నవారిని బయటకు తీసే ప్రయత్నాలను చేస్తోంది. ఇప్పటి వరకు ముగ్గురిని రక్షించారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
1997లో అత్యధికంగా 178.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దాన్ని మించిపోయేలా... ఈరోజు ఏకంగా 186 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. యలహంక ప్రాంతం నడుము లోతు నీటిలో మునిగిపోయింది. కార్లు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది ప్రజలను బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.