KTR: ఓ పేషెంట్ గురించి నారా లోకేశ్, కేటీఆర్‌కు తెలంగాణ వ్యక్తి ట్వీట్
- రాజమండ్రిలో అస్వస్థతకు గురైన తెలంగాణవాసి
- కిమ్స్ ఆసుపత్రిలో చేరిక... రూ.1 లక్ష వరకు వైద్యం కోసం ఖర్చు
- మరో రూ.40 వేలు అడుగుతున్నారని.. జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి
- వెంటనే స్పందించిన కేటీఆర్
రాజమండ్రిలో తన స్నేహితురాలి తండ్రి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారని, ఖర్చు విషయంలో జోక్యం చేసుకోవాలని తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్‌కు విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, మంత్రి కేటీఆర్ కూడా కల్పించుకోవాలని కోరుతూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. దీనిని కేటీఆర్ రీట్వీట్ చేశారు.
'హైకొల్లాపూర్' పేరుతో ఉన్న ఎక్స్ హ్యాండిల్ నుంచి 'ఎమర్జెన్సీ' అంటూ ట్వీట్ వచ్చింది. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన సత్యకృష్ణ అనే వ్యక్తి ఈ నెల 17న రాజమండ్రిలో ఓ పెళ్లికి హాజరయ్యారని, అక్కడే అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారని, రాజమండ్రిలో కిమ్స్ ఆసుపత్రిలో రూ.1 లక్ష వరకు ఖర్చు చేసినట్లు తెలిపారు. మరో రూ.40,000 ఇస్తే కానీ డిశ్చార్జ్ చేసేది లేదని చెబుతున్నారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని లోకేశ్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. కేటీఆర్ అన్న కూడా కొంచెం రిక్వెస్ట్ చేయండంటూ విజ్ఞప్తి చేశారు.
ఈ ట్వీట్‌పై స్పందించిన కేటీఆర్... కిమ్స్ మేనేజ్మెంట్తో మాట్లాడుతామని, అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. సాయంత్రానికి 'హైకొల్లాపూర్' మరో ట్వీట్ చేసింది. సమస్య పరిష్కారమైందని, త్వరగా స్పందించి, సమస్యను పరిష్కరించేలా కృషి చేసినందుకు కేటీఆర్‌కు థ్యాంక్స్ అని మరో ట్వీట్ చేశారు.