Building Collapse: బెంగళూరులో కుప్పకూలిన ఏడంతస్తుల భవనం.. ఐదుగురి మృతి.. వీడియో ఇదిగో!
- శిథిలాల కింద చిక్కుకున్న మరికొందరు కార్మికులు
- ప్రమాద సమయంలో భవనంలో 20 మంది వర్కర్లు
- బేస్‌మెంట్ బలహీనంగా ఉండటమే ప్రమాదానికి కారణమన్న టైల్ కాంట్రాక్టర్ అహ్మద్
- నాలుగు అంతస్తులకే అనుమతి.. ఏడంతస్తులు వేసిన యజమాని
బెంగళూరులో కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 15-16 మంది భవనం శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఇప్పటి వరకు 13 మందిని రక్షించారు. మిగతా వారిని రక్షించేందుకు సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మంగళవారం సాయంత్రమే ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు.
గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో టైల్, కాంక్రీట్ వర్కర్లు, ప్లంబర్లు సహా మొత్తం 20 మంది ఉన్నట్టు టైల్ వర్క్ కాంట్రాక్టర్ అహ్మద్ తెలిపాడు. బేస్‌మెంట్ బలహీనంగా ఉండడం వల్లే భవనం కుప్పకూలినట్టు పేర్కొన్నాడు. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు.
ప్రమాద సమయంలో మొత్తం 21 మంది కార్మికులు ఉన్నట్టు చెప్పారు. 26 ఏళ్ల అర్మన్ మృతదేహాన్ని వెలికి తీసినట్టు చెప్పారు. భవనం కూలుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. నాలుగు అంతస్తులకే ఈ భవనానికి అనుమతి ఉందని, నిబంధనలు ఉల్లంఘించి మిగతా అంతస్తులు నిర్మించినట్టు అధికారులు తెలిపారు.