YS Jagan: రాష్ట్రంలో ఘోరమైన పరిస్థితులు.. రెడ్‌బుక్ పాలన సాగుతోంది: వైఎస్ జగన్
- సహానా కుటుంబాన్ని పరామర్శించిన జగన్
- పార్టీ తరఫున సహానా ఫ్యామిలీని ఆదుకుంటామన్న మాజీ సీఎం
- ఆమె మృతికి కారణమైన నవీన్ టీడీపీకి చెందిన వాడన్న వైసీపీ అధినేత
- రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయాయని వ్యాఖ్య
- ఆడవాళ్లకు రక్షణలేకుండా పోయిందని ఆవేదన
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువతి సహానా.. రౌడీషీటర్ నవీన్ దాడిలో తీవ్రంగా గాయపడి మృతిచెందిన విషయం తెలిసిందే. గుంటూరు జీజీహెచ్‌లో ఉన్న ఆమె మృతదేహాన్ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరిశీలించారు. మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ తరఫున సహానా ఫ్యామిలీని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
అలాగే రాష్ట్రంలో ఇప్పటివరకు వివిధ ఘటనలలో చనిపోయిన ఆరుగురు ఆడపిల్లల కుటుంబాలకు వైసీపీ తరఫున రూ.10లక్షలు ఆర్థిక సాయం ఇస్తామన్నారు. అనంతరం జగన్ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో దారుణపరిస్థితులు ఉన్నాయని, రెడ్‌బుక్ పాలన సాగుతోందని విమర్శించారు.
సహానా మృతదేహాన్ని పరిశీలించిన తనకు ఆమె శరీరంపై కమిలిన గాయాలు కనిపించాయన్నారు. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి, ఆసుపత్రిలో చేర్పించి వెళ్లిపోయారని ఆరోపించారు. ఆమె మృతికి కారణమైన నవీన్ టీడీపీకి చెందిన వాడని, అతను స్థానిక ఎంపీతో సన్నిహితంగా ఉండేవాడని ఆరోపించారు.
సీఎం చంద్రబాబుతో కలిసి అతను దిగిన ఫొటోలు కూడా ఉన్నాయన్నారు. నిందితుడు తమ పార్టీకి చెందినవాడు కావడంతోనే టీడీపీ నిస్సిగ్గుగా అతడ్ని కాపాడాలని చూస్తోందని జగన్ దుయ్యబట్టారు.
ఇంతవరకూ మృతురాలి కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే, హోంమంత్రి ఎవరూ పరామర్శించకపోవడం శోచనీయం అని జగన్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా మహిళలకు రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతకు దిగజారిపోయాయో దళిత మహిళలను చూస్తే అర్థమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ ప్రభుత్వ హయాంలో మహిళలకు దిశయాప్ ద్వారా భద్రత కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా జగన్ గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఆడవాళ్లకు రక్షణ ఉండేదన్నారు.
ఇదిలాఉంటే.. నిందితుడు నవీన్‌ను తెనాలి పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. సహానా-నవీన్ మధ్య అప్పు విషయమై ఉన్న తగాదాలే ఆమె హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు. అలాగే టీడీపీతో నవీన్‌కు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తెలిపారు. ఇంత స్పష్టంగా పోలీసులు చెబుతున్నా.. వైసీపీ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని టీడీపీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి.