Nara Lokesh: మంత్రి లోకేశ్ చొరవ... ఏపీలో రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులకు సెరెంటికా గ్లోబల్ సిద్ధం
- ముంబయిలో లోకేశ్ బిజీ బిజీ
- సెరెంటికా గ్లోబల్ సంస్థ ప్రతినిధులతో సమావేశం
- ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి చూపిన సెరెంటికా
వేదాంత గ్రూప్ అనుబంధ సంస్థ సెరెంటికా గ్లోబల్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రతినిధులతో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ నేడు ముంబయిలోని సంస్థ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ లో 10 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టుల నిర్మాణానికి తమ సంస్థ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.
మంత్రి లోకేశ్ స్పందిస్తూ... 2030 నాటికి 72 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలన్న ఏపీ ప్రభుత్వ లక్ష్యసాధన కోసం సెరెంటికా గ్లోబల్ వంటి కార్పొరేట్లు, ఇన్వెస్టర్లకు ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలని తాము భావిస్తున్నట్లు లోకేశ్ వివరించారు.