Chandrababu: విజయవాడ వరదల సాయంపై సీఎం చంద్రబాబు సమీక్ష
గత నెల సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాలు విజయవాడ ప్రాంతంలో వరద విలయాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఇళ్లలోకి వరదలు ముంచెత్తడంతో లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు. వేలాది ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నాయి. వరదలు తగ్గిన వెంటనే క్షేత్ర స్థాయిలో పరిశీలన అనంతరం సాయం పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కాగా బాధితులకు ఇప్పటివరకు అందిన సాయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిన్న (గురువారం) సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలకు అందించిన సాయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
కాగా వరదలు తగ్గిన 15 రోజుల్లో మొత్తం 4,19,528 మందికి పరిహారం అందిందని సీఎం చంద్రబాబుకు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం రూ.618 కోట్ల పరిహారం నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి జమచేశామని వివరించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఏపీ సీఎంవో ప్రకటన చేసింది.