Revanth Reddy: సీఎం గారూ... 100 రోజుల్లో హైడ్రా బుల్డోజర్ మీ సోదరుడి ఇంటి ఒక్క ఇటుకనూ ముట్టలేదు: బీఆర్ఎస్ ఆగ్రహం
- వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు చేసినట్లుగా కాంగ్రెస్ తీరు ఉందని విమర్శ
- ప్రజాపాలన అంటే పేదలను బజారుకీడ్చిన బరితెగింపు పాలన అని ఆగ్రహం
- నోటీసులు కూడా ఇవ్వకుండా హైడ్రా పేరుతో ఇళ్లు కూలగొడుతున్నారని మండిపాటు
హైడ్రాకు నేటితో 100 రోజులు పూర్తయిందని... హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల జీవితాలను రోడ్డుకీడ్చిందని బీఆర్ఎస్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించింది. 100 రోజుల్లో హైడ్రా బుల్డోజర్ మీ సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటి ఒక్క ఇటుకను కూడా ఎందుకు ముట్టలేకపోయిందో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని నిలదీసింది. వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు చేసినట్టుగా హైదరాబాద్ మహానగర కబ్జాలను ప్రోత్సహించిన కాంగ్రెస్... కొత్తగా పరిరక్షణ పేరుతో డ్రామాలు ఆడుతోందని విమర్శించింది.
ప్రజాపాలన అని పేదల జీవితాలను బజారుకీడ్చిన బరితెగింపు మీ ప్రజా ప్రభుత్వం నినాదానికి తిలోదకాలు ఇవ్వడం కాదా? అని ప్రశ్నించింది. కబ్జాలు చేసి... కార్పొరేట్లకు ఊడిగం చేసి... ఆ పేదలు ఇళ్లను నిర్మించుకోలేదని, రూపాయి... రూపాయి కూడబెట్టి శ్రమకోర్చి సొంతింటిని నిర్మించుకున్నారని పేర్కొంది. కనీసం నోటీసులు ఇవ్వకుండా హైడ్రా పేరుతో కూలగొట్టేందుకు మనసెలా వచ్చిందని సీఎంను ప్రశ్నించింది.
పేదల నివాసాలు అక్రమ నిర్మాణాలైతే... వాటికి అనుమతులు ఇచ్చిన అధికారుల అంతుచూడకుండా అన్యాయం... అధర్మమంటే ఎరగని సామాన్య జనంపై ఈ బుల్డోజర్ దాడులు ఎవరి కోసం? రాహుల్ గాంధీ ఏమో బుల్డోజర్ సర్కార్ను వ్యతిరేకిస్తాడు... మీరేమో ఇక్కడ యధేచ్చగా బుల్డోజర్ విధానాలను కొనసాగిస్తున్నారు? మీ పార్టీకి ఒక స్పష్టమైన విధానమంటూ ఉండదా? అంటూ ప్రశ్నల సంధించింది. ఇప్పటికీ చెప్తున్నాం... హైడ్రా పేరుతో పేదలను నిరాశ్రయులను చేస్తామంటే ... ఆ హైడ్రా బుల్డోజర్లకు అడ్డుపడతామని పేర్కొంది.