Police Families: ఈ విధంగా వందలాది మంది రావాల్సిన అవసరం ఎందుకొచ్చింది?: ప్రవీణ్ కుమార్
- ఆందోళనలు చేపడుతున్న పోలీసుల కుటుంబ సభ్యులు
- వన్ పోలీస్ హామీ అమలు చేయాలని డిమాండ్
- నేడు సచివాలయ ముట్టడి
- వీడియో పంచుకున్న బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్
రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి ధ్వజమెత్తారు. పోలీసు కుటుంబాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత దారుణంగా అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఈ విధంగా చంటిపిల్లలను చంకలో వేసుకుని సెక్రటేరియట్ వద్దకు వందలాది పోలీసు కుటుంబాలు రావాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు.
బెటాలియన్లలో పనిచేసే పోలీసుల కుటుంబ సభ్యులు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. వన్ పోలీస్ హామీ అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఒకే దగ్గర విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలోనే వారు నేడు సచివాలయ ముట్టడికి యత్నించారు.
వాళ్ల బాధలు చూస్తుంటే నిజంగా గుండె తరుక్కుపోతోందని ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మీరు అన్నదమ్ముల మధ్య పంచాయితీ పెట్టి చోద్యం చేస్తున్నారు సీఎం గారూ అంటూ ట్వీట్ చేశారు. పోలీసుల కుటుంబ సభ్యులు సెక్రటేరియట్ దిశగా పరుగులు తీస్తున్న వీడియోను కూడా ప్రవీణ్ కుమార్ పంచుకున్నారు.