Team India: ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టు ప్రకటన.. షమీకి దక్కని చోటు.. తెలుగు కుర్రాడికి పిలుపు!
- బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించే భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
- షమీ స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణాకు చోటు
- ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి పిలుపు
- 22న పెర్త్‌లో ప్రారంభమయ్యే తొలి టెస్టుతో ఈ టూర్ ప్రారంభం
- ఈ పర్యటనలో మొత్తం ఐదు టెస్టులు ఆడనున్న టీమిండియా
- అలాగే దక్షిణాఫ్రికాతో 4 టీ20ల కోసం కూడా జట్టు ఎంపిక
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. నవంబర్ 22న పెర్త్‌లో ప్రారంభమయ్యే తొలి టెస్టుతో ఈ పర్యటన ప్రారంభం కానుంది. భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ కాగా, వైస్ కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రాను ఎంపిక చేసింది. గాయం నుంచి కోలుకున్నట్లు వార్తలు వస్తున్న వెటరన్ పేసర్ మహమ్మద్ షమీకి చోటు దక్కలేదు. అతని స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణా తొలిసారి టెస్టు జట్టులోకి వచ్చాడు.
అలాగే ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి కూడా ఎంపికయ్యాడు. అతనితో పాటు దేశవాళీ క్రికెట్లో విశేషంగా రాణిస్తున్న అభిమన్యు ఈశ్వరన్‌కు కూడా పిలుపు వచ్చింది. రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్ ఇద్దరు వికెట్ కీపర్లుగా జట్టులో చోటు సంపాదించారు. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ ఉన్నారు. బుమ్రా, రానాతో పాటు ఇతర పేసర్లు మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ జట్టులో ఉన్నారు.
అలాగే జట్టులో ముగ్గురు స్పిన్-ఆల్‌రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లకు చోటు దక్కింది. లెఫ్టార్మ్ స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ టూర్‌కు ఎంపిక కాలేదు. ఇక ఫాస్ట్ బౌలర్లు ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్ రిజర్వ్‌లుగా ఎంపికయ్యారు.
ప్రస్తుతం న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ పూర్తయిన తర్వాత భారత్ ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లనుంది. నవంబర్ 22న పెర్త్‌లో ప్రారంభమయ్యే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌లో భారత్ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఆడనుంది.
ఆస్ట్రేలియా టూర్‌తో పాటు దక్షిణాఫ్రికాలో నాలుగు టీ20ల కోసం పర్యటించే టీమిండియాను కూడా బీసీసీఐ ఎంపిక చేసింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో నవంబర్ 8 నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న 4 టీ20ల సిరీస్ కోసం 15 మంది సభ్యులు గల భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. నవంబర్ 8, 10, 13, 15 తేదీల్లో నాలుగు టీ20లు జరగనున్నాయి.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్) , రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.
దక్షిణాఫ్రికాతో 4 టీ20ల కోసం భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ వైషాక్, అవేష్ ఖాన్, యశ్ దయాల్.