Manda Krishna Madiga: మా విజ్ఞప్తికి సీఎం చంద్రబాబు స్పందిస్తారని ఆశిస్తున్నాం: మంద కృష్ణ
- ఏపీలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని కోరిన మంద కృష్ణ మాదిగ
- ఎస్సీ వర్గీకరణ అమలు అయ్యే వరకూ ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ ఇవ్వవద్దని వినతి
- ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు
ఏపీలో ఎస్సీ వర్గీకరణ ప్రారంభం అయ్యే వరకూ ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ ఇవ్వకూడదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలును వేగవంతం చేయాలని కోరారు.
నవంబర్ మొదటి వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని మంత్రి నారా లోకేశ్ చెప్పారన్నారు. అందుకే ఎస్సీ వర్గీకరణ ప్రారంభం అయ్యే వరకూ ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకూడదని కోరుతున్నామన్నారు. తమ విజ్ఞప్తిపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకువచ్చారని మంద కృష్ణ ఈ సందర్భంగా గుర్తు చేశారు. షెడ్యూల్ కులాల వర్గీకరణకు ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు.
పంజాబ్ రాష్ట్రంలో 2006లో ఎస్సీ వర్గీకరణ చట్టం తెచ్చిందన్నారు. తమిళనాడు ప్రభుత్వం 2009లో ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా చట్టం తీసుకువచ్చిందని చెప్పారు. ఏపీలో వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టులో న్యాయవాదిని సైతం నియమించలేదని విమర్శించారు. హర్యానా, మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ దిశగా ముందుకు సాగుతున్నాయని చెప్పారు.
ఎస్సీ వర్గీకరణ అమలు అయ్యే వరకూ ఎటువంటి నోటిఫికేషన్లు ఇవ్వమని తెలంగాణ సర్కార్ పేర్కొందని తెలిపారు. రాష్ట్రంలో ఇంత వరకూ ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ ప్రారంభం కాలేదన్నారు. ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడానికి మాదిగలు శక్తివంచన లేకుండా పని చేశారని మంద కృష్ణ మాదిగ తెలిపారు. ఏపీ సర్కార్ ఎస్సీ వర్గీకరణ అమలు వేగవంతం చేయాలని, గత జగన్ పాలనలో ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్లలో కూడా ఎస్సీ వర్గీకరణ వర్తింపజేయాలని మంద కృష్ణ కోరారు.