AP High Court: మరోసారి హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ నేత పిన్నెల్లి
- బెయిల్ షరతులు సడలింపు కోరుతూ హైకోర్టులో పిన్నెల్లి పిటిషన్
- విదేశాలకు వెళ్లేందుకు పాస్పోస్టు వెనక్కి ఇప్పించాలని వినతి
- విచారణ ఈ నెల 28వ తేదీకి వాయిదా
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తనపై విధించిన బెయిల్ షరతులను సడలించాలని, విదేశాలకు వెళ్లేందుకు పాస్ పోర్టు వెనక్కి ఇప్పించాలని హైకోర్టును పిన్నెల్లి కోరారు. పిన్నెల్లి దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. పిన్నెల్లి తరపున న్యాయవాది రామలక్ష్మణరెడ్డి వాదనలు వినిపించారు.
పిటిషనర్ కుమారుడు సింగపూర్లో ఉన్నత విద్యకు వెళుతున్నారని, తండ్రిగా పిటిషనర్ కూడా వెళ్లాల్సి ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లి పాస్పోర్టు విడుదలకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ క్రమంలో పోలీసుల తరపు న్యాయవాది ఎన్ అశ్వనీకుమార్.. కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని ధర్మాసనాన్ని కోరారు. అందుకు అంగీకరించిన హైకోర్టు .. విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది.
ఇంతకు ముందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసంతో పాటు టీడీపీ కార్యకర్తపై హత్యాయత్నం కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసుల్లో పిన్నెల్లిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. తర్వాత పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించగా, ఆయనకు షరతులతో బెయిల్ మంజూరయింది. ఈ క్రమంలో బెయిల్ షరతుల సడలింపునకు పిటిషన్ దాఖలు చేశారు.