Madhya Pradesh: భర్తను చెట్టుకు కట్టేసి.. భార్యపై సామూహిక లైంగికదాడి

Man Tied To Tree Wife Gang Raped At Picnic Spot In Madhya Pradesh
  • మధ్యప్రదేశ్‌లో ఒకే రోజు రెండు అత్యాచార ఘటనలు 
  • ఒకటి ఇండోర్‌లో, మరోటి రేవాలో..నిందితుల అరెస్ట్
  • బీజేపీపై దుమ్మెత్తి పోసిన కాంగ్రెస్ ఎంపీ చీఫ్ జితు పట్వారీ
కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో వైద్యురాలిపైనా, మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో ఇద్దరు బాలికలపైనా జరిగిన లైంగికదాడి ఘటనలు మనం ఇంకా మరచిపోకముందే మధ్యప్రదేశ్‌లో ఒకే రోజు రెండు దారుణ ఘటనలు జరిగాయి. వాటిలో ఒకటి క్లీన్ సిటీ ఇండోర్‌లో కాగా, మరొకటి రేవాలో జరిగింది. 

రేవాలో ఓ ఆలయ సమీపంలో పిక్‌నిక్‌కు వెళ్లిన జంటపై కొందరు దుండగులు దాడి చేసి భర్తను చెట్టుకు కట్టేశారు. ఆపై అతడి భార్య మీద సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనను వీడియో తీసి వారిని వేధించడమే కాకుండా సోషల్ మీడియాలో ఈ వీడియోను విడుదల చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 21న ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. 

ఇండోర్‌లో మతిస్థిమితం లేని మహిళపై.. 
ఇండోర్‌లో మతిస్థిమితం లేని మహిళపై ఓ దినసరి కూలీ అత్యాచారానికి పాల్పడ్డాడు. మంగళవారం తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో జరిగిందీ ఘటన. నిందితుడిని సోనుగా గుర్తించి అరెస్ట్ చేశారు. వ్యర్థాలు ప్రాసెస్ చేసే యూనిట్‌లోకి ఆమెను తీసుకెళ్లి సోను అత్యాచారానికి పాల్పడ్డాడు. నేరం చేసినట్టు నిందితుడు అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. 

రాజకీయ దుమారం
ఒకే రోజు జరిగిన ఈ రెండు అత్యాచార ఘటనలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడింది. దుండగుల బారినపడి మన ఆడ కూతురు రోడ్లపై నగ్నంగా తిరుగుతుంటే ముఖ్యమంత్రి మాత్రం ఓ కార్యక్రమంలో బిజీగా ఉన్నారని కాంగ్రెస్ చీఫ్ జితు పట్వారీ ఎక్స్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండోర్ ఘటనలో మహిళ మహాభారతంలోని ద్రౌపది పరిస్థితిని ఎదుర్కొందని ఆవేదన వ్యక్తం చేశారు. తనను తాను దేవుడిగా చెప్పుకుంటున్న ముఖ్యమంత్రికి ద్రౌపది వస్త్రాపహరణం కనిపించలేదా? అని ప్రశ్నించారు. కుమార్తెలపై దాడులు ఆగడం లేదని, సీఎం మాత్రం కళ్లు మూసుకుని కూర్చుంటున్నారని దుమ్మెత్తి పోశారు. 
Madhya Pradesh
Indore
Rewa
Crime News

More Telugu News