Revanth Reddy: గుస్సాడీ నృత్యకారుడు కనకరాజు మృతిపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు ఆదేశం
- అనారోగ్యంతో కన్నుమూసిన ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన గుస్సాడీ నృత్యకారుడు కనకరాజు
- ఆయన మృతిపట్ల సంతాపం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
- కనకరాజు మరణం తెలంగాణ కళలకు తీరని లోటని వ్యాఖ్య
కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మరవాయికి చెందిన గుస్సాడీ నృత్యకారుడు, పద్మశ్రీ కనకరాజు అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. ఈరోజు ఆయన అంత్యక్రియలు ఆదివాసీల సంప్రదాయం ప్రకారం జరగనున్నాయి.
కనకరాజు మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలంగాణ కళలకు తీరని లోటని పేర్కొన్నారు. గుస్సాడీ నృత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడిన గొప్ప కళాకారుడని కొనియాడారు.
అంతరించిపోతున్న ఆదివాసీ కళను దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన కనకరాజు మరణం తనను తీవ్రంగా కలిచివేసిందంటూ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. కనకరాజు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో జరిపించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు.
కాగా, ప్రతియేటా దీపావళి సందర్భంగా గుస్సాడీ నృత్యంతో అందరినీ అలరించే కనకరాజు ఈసారి పండగకు కొన్ని రోజుల ముందే మరణించడంతో ఆదివాసీలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక గుస్సాడీ నృత్యానికి ప్రచారం కల్పించడంలో తనవంతు కృషి చేసినందుకు గాను కనకరాజుకు కేంద్రం 2021లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిన విషయం తెలిసిందే.