Drugs: ఆన్‌లైన్ ద్వారా డ్రగ్స్ ఇంజక్షన్‌లు విక్రయిస్తున్న ముఠా సభ్యుల పట్టివేత
- హాజీపూర్ కేంద్రంగా డ్రగ్స్ ఇంజెక్షన్లు సరఫరా
- సరస్వతి ఎంటర్‌ప్రైజెస్ పేరుతో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠా
- ప్రధాన నిందితుడు సహా మరో వ్యక్తి అరెస్టు
ఆన్‌లైన్‌లో డ్రగ్స్ ఇంజెక్షన్స్ విక్రయిస్తున్న ముఠా సభ్యులను తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో (టీజీ న్యాబ్) పోలీసులు పట్టుకున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాల నిరోధానికి టాస్క్‌ఫోర్స్ విస్తృతంగా తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో డ్రగ్స్ విక్రేతలు కొత్త ఫంథాను ఎంచుకున్నారు. అధికారుల కళ్లు కప్పేందుకు ఆన్‌లైన్‌లో డ్రగ్స్ ఇంజెక్షన్‌లను విక్రయిస్తున్నారు. అయినప్పటికీ హాజీపూర్ కేంద్రంగా డ్రగ్స్ ఇంజెక్షన్లు సరఫరా చేస్తున్నారన్న ముఠా గుట్టును టీజీ న్యాబ్ పోలీసులు రట్టు చేశారు.
పక్కా సమాచారంతో టీజీ న్యాబ్ పోలీసులు నిఘావేసి ముఠా సభ్యులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు విజయ్ కుమార్ గుప్తాతో పాటు విక్రయదారుడు నయీముద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా నుండి డ్రగ్స్ ఇంజెక్షన్లు కొనుగోలు చేసి స్థానికంగా విక్రయిస్తున్న మరో ఏడుగురుని కూడా అదుపులోకి తీసుకున్నారు. సరస్వతి ఎంటర్‌ప్రైజెస్ పేరుతో ప్రధాన నిందితుడు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పటి వరకూ వీరు ఆన్‌లైన్‌లో రూ.88 లక్షల విలువైన డ్రగ్స్ ఇంజెక్షన్‌లు విక్రయించినట్లు సమాచారం.