Jayam Ravi: జయం రవితో నిశ్చితార్థ వార్తలు, ఫొటోలపై క్లారిటీ ఇచ్చిన నటి ప్రియాంక మోహన్

Actress Priyanka Mohan Responds Over Engagement News With Jayam Ravi
  • భార్యతో విడాకులు తీసుకుంటున్న జయం రవి
  • నటి ప్రియాంక మోహన్‌ను పెళ్లాడబోతున్నట్టు వార్తలు
  • ఇద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారంటూ ఓ ఫొటో వైరల్
  • అది ‘బ్రదర్’ సినిమాలోని స్టిల్ అని ప్రియాంక స్పష్టీకరణ
  • ఆ వార్తలు తనను షాక్‌కు గురిచేశాయని ఆవేదన
విడాకుల వార్తలతో ఇటీవల హెడ్‌లైన్స్‌లోకి ఎక్కిన కోలీవుడ్ ప్రముఖ నటుడు జయం రవి.. నటి ప్రియాంక మోహన్‌ను పెళ్లాడబోతున్నట్టు వార్తలొచ్చాయి. వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నట్టు చెబుతూ ఇద్దరూ పూల దండలు వేసుకుని ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా, ఈ వార్తలపై ప్రియాంక స్పందించారు. 

ఆ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని తేల్చి చెప్పారు. ఆ వార్తలు తనను షాక్‌కు గురిచేశాయని చెప్పారు. తామిద్దరం ‘బ్రదర్’ సినిమా కోసం కలిసి పనిచేశామని, ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా చిత్ర బృందం ఈ ఫొటోను రిలీజ్ చేసినట్టు తెలిపారు. ఆ ఫొటో చూసిన వారు తమకు ఎంగేజ్‌మెంట్ అయిందని అనుకున్నారని తెలిపారు. షూటింగ్స్‌తో తాను బిజీగా ఉండడం వల్ల ఈ విషయం తన దృష్టికి రాలేదని చెప్పారు. ఆ ఫొటో నిజమేననుకుని టాలీవుడ్‌లోని తన స్నేహితులు కూడా కాల్ చేశారని తెలిపారు. దీంతో ఏం జరుగుతోందో తనకు అర్థం కాలేదని, అది సినిమాలోని స్టిల్ మాత్రమేనని చెప్పానని వివరించారు. ఈ ఫొటోను రిలీజ్ చేసిన మూవీ టీంను తిట్టుకున్నానని చెప్పారు. ఈ ఘటన తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని ప్రియాంక పేర్కొన్నారు.

‘నానీస్ గ్యాంగ్‌లీడర్’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక ఇటీవల విడుదలైన ‘సరిపోదా శనివారం’తో మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆమె ‘ఓజీ’ కోసం పనిచేస్తున్నారు. కోలీవుడ్‌లో ఆమె నటించిన ‘బ్రదర్’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
Jayam Ravi
Priyanka Mohan
Kollywood
Entertainment News

More Telugu News