Police: తెలంగాణలో బెటాలియన్ పోలీసుల నిరసన... తీవ్రంగా స్పందించిన డీజీపీ
- ఒకే పోలీస్ విధానం అమలు చేయాలంటూ రాష్టవ్యాప్త బెటాలియన్ పోలీసుల నిరసన
- ఆందోళనల వెనుక ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ఉన్నాయనే అనుమానం ఉందన్న డీజీపీ
- ఆందోళనలు చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని హెచ్చరిక
తెలంగాణలో బెటాలియన్ పోలీసుల ఆందోళనపై డీజీపీ జితేందర్ స్పందించారు. ఈ ఆందోళనల వెనుక ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ఉన్నాయనే అనుమానం కలుగుతోందన్నారు. సెలవులపై పాత పద్ధతినే కొనసాగిస్తామని చెప్పినప్పటికీ ఆందోళనలు కొనసాగించడం సరికాదన్నారు. తెలంగాణ రిక్రూట్ మెంట్ వ్యవస్థను అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని వెల్లడించారు. ఆందోళనలు చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఒకే పోలీస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా బెటాలియన్ పోలీసులు ఆందోళనకు దిగారు. ఈ నిరసనలో కానిస్టేబుళ్లతో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లాలోని మామునూరులో 4వ బెటాలియన్ కానిస్టేబుళ్లు స్థానిక బెటాలియన్ కమాండెంట్ ఆఫీస్ వద్ద బైఠాయించారు.
నల్గొండలో రూరల్ ఎస్సై గో బ్యాక్ అంటూ 12వ బెటాలియన్ కానిస్టేబుళ్లు నిరసన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బెటాలియన్ కానిస్టేబుళ్లు, వారి కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. వారు సాగర్ రోడ్డు వద్ద ఆందోళన చేపట్టారు.
కాగా, బెటాలియన్ పోలీసుల ఆందోళనపై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణలో అద్భుతమైన ప్రభుత్వం ఉందని, పోలీసులకు వ్యతిరేకంగా పోలీసులే నిరసన తెలిపేలా ప్రభుత్వం ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పోలీసులే కార్మికల తరహాలో సమ్మె చేస్తున్నారని, ఇది సమ్మె కాని సమ్మె అంటూ హరీశ్ రావు ట్వీట్ చేశారు. బెటాలియన్ పోలీసుల ఆందోళనలకు సంబంధించిన వీడియోలను వారు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.