Sharmila: సుబ్బారెడ్డి... జగన్ మోచేతి నీళ్లు తాగే వ్యక్తి: షర్మిల ఘాటు వ్యాఖ్యలు
- జగన్-షర్మిల ఆస్తుల వివాదంలో సుబ్బారెడ్డి వ్యాఖ్యలు
- జగన్ ఆస్తిలో షర్మిలకు భాగం ఉంటే షర్మిల కూడా జైలుకెళ్లి ఉండేదని వెల్లడి
- సుబ్బారెడ్డి తన బిడ్డలు, మనవలపై ప్రమాణం చేయాలన్న షర్మిల
జగన్-షర్మిల ఆస్తుల వివాదంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ... టీడీపీ కుట్రలో షర్మిల పావుగా మారిందని అనడం తెలిసిందే. జగన్ కు సంబంధించిన ఆస్తుల్లో షర్మిలకు కూడా వాటాలు ఉన్నది నిజమే అయితే, ఈడీ షర్మిలపై కూడా కేసులు పెట్టేది కదా... అని వైవీ వ్యాఖ్యానించారు. సరస్వతి సిమెంట్స్ ఆస్తులు ఈడీ అటాచ్ మెంట్ లో ఉన్నాయని, అలాంటి ఆస్తుల కోసం షర్మిల పోరాడుతున్నారా? అని ప్రశ్నించారు.
ఆస్తుల విషయంలో ఇప్పటివరకు జగన్ ఒక్కరే జైలుకెళ్లారని, మరి ఆ ఆస్తులపై షర్మిలకు కూడా హక్కు ఉంటే ఆమె కూడా జైలుకు వెళ్లేవారని వైవీ సుబ్బారెడ్డి వివరించారు. వైవీ సుబ్బారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ప్రెస్ మీట్లో ఘాటుగా స్పందించారు.
"సుబ్బారెడ్డి గారు ఎవరు...? సుబ్బారెడ్డి గారు జగన్ మోచేతి నీళ్లు తాగే వ్యక్తి. జగన్ పదవులు ఇస్తే ఆ పదవులు అనుభవిస్తున్నారు. సుబ్బారెడ్డి కుటుంబం రాజకీయంగానే కాదు, ఆర్థికంగానూ లబ్ధి పొందింది. జగన్ సీఎంగా ఉన్న సమయంలో సుబ్బారెడ్డి, ఆయన కొడుకు ఆర్థికంగా లాభపడ్డారు. మరి సుబ్బారెడ్డి గారు ఇలా కాక ఇంకెలా మాట్లాడతారు?
సుబ్బారెడ్డి గారు మాత్రమే కాదు... రేపు విజయసాయిరెడ్డి కూడా ఇలాగే మాట్లాడొచ్చు. ఎందుకంటే, సాయిరెడ్డి కూడా వాళ్ల టీమ్ లోనే ఉన్నారు... వాళ్ల మోచేతి కిందే ఉన్నారు. అందుకే ఆయన మాట్లాడినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి ఇద్దరూ కూడా జగన్ పక్షాన ఉన్నారని తెలిసి కూడా... నిన్న నేను రాసిన లేఖలో ఆ ఇద్దరి పేర్లను ఎందుకు ప్రస్తావించానంటే... వాళ్లలో ఇంకా ఏమైనా నిజాయతీ మిగిలుందా అని చూశాను. ప్రజలకు, ముఖ్యంగా అమ్మకు కూడా వాళ్ల గురించి తెలియాలి అనుకున్నాను.
వీళ్లిద్దరికీ నిజాలన్నీ తెలుసు. వీళ్లకు రాజశేఖర్ రెడ్డి గురించి మొత్తం తెలుసు. రాజశేఖర్ రెడ్డి మనోభావాలు, ఆయన ఆశయాలు అన్నీ తెలుసు. అయినా కూడా ఇంత దిగజారి మాట్లాడుతున్నారు. వాళ్ల నిజస్వరూపం బట్టబయలు కావాలనే లేఖలో వాళ్ల పేర్లను చేర్చాను. ముఖ్యంగా, అమ్మకు అర్థం కావాలని వాళ్ల పేర్లు రాశాను.
నా విషయానికొస్తే... నేను చెబుతున్నది నిజమని ప్రమాణం చేయగలను. సుబ్బారెడ్డి గారు కూడా ఆయన చెబుతున్నది నిజమని ప్రమాణం చేయగలరా? భారతి సిమెంట్స్ అయితేనేమి, సాక్షి అయితేనేమి... ఇలాంటి ఆస్తులన్నింటిలో నలుగురి బిడ్డలకు (జగన్ ఇద్దరు పిల్లలు, షర్మిల ఇద్దరు పిల్లలకు) సమాన వాటా ఉండాలన్నది రాజశేఖర్ రెడ్డి గారి నిర్ణయం. ఇది నిజమని ఇవాళ నా బిడ్డలపై ప్రమాణం చేసి చెబుతున్నాను.
రాజశేఖర్ రెడ్డి గారు చనిపోక ముందు... పాప (షర్మిల) పేరు మీదకు ఇంకా ఆస్తులు బదలాయించలేదా? అని జగనన్నను అడిగారు. అందుకు జగనన్న... డోంట్ వర్రీ డాడ్... పాప మేలు కోరే వాళ్లలో నేను ముందు ఉంటాను అన్నాడు. ఇది నిజమని నా బిడ్డలపై ప్రమాణం చేసి చెబుతున్నా. మరి నిన్న తాను చెప్పిన విషయాలన్నీ సుబ్బారెడ్డి గారు కూడా తన బిడ్డల మీద, మనవల మీద ప్రమాణం చేసి చెప్పగలరా?" అని షర్మిల నిలదీశారు.