Mahesh Kumar Goud: కేటీఆర్ చేసిన తప్పులకు పదేళ్లు శిక్షపడినా తక్కువే: మహేశ్‌కుమార్ గౌడ్

Mahesh Kumar Goud says KTR should punished for his wrong doings
  • కాంగ్రెస్‌లో చేరేందుకు బీఆర్ఎస్ నాయకులు వరుస కట్టారన్న టీపీసీసీ చీఫ్
  • కేటీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి ఎన్నో తప్పులు చేశారని విమర్శ
  • జీవన్‌రెడ్డి ఆవేదనతోనే మాట్లాడారని, పార్టీపై వ్యతిరేకత లేదన్న టీపీసీసీ చీఫ్
  • హైడ్రా పేరుతో ఇప్పటి వరకు ఒకే ఒక పేద ఇల్లు కూలిందని వెల్లడి
కేటీఆర్ చేసిన తప్పులకు పదేళ్లు జైలు శిక్షపడినా తక్కువే అవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. ఆయన నిన్న ఢిల్లీలో మాట్లాడుతూ... తమ పార్టీలో చేరేందుకు చాలామంది బీఆర్ఎస్ నాయకులు వరుసలో ఉన్నారన్నారు. కేటీఆర్‌తో సన్నిహితంగా ఉన్నవారు కూడా తమతో టచ్‌లో ఉన్నారని వెల్లడించారు. కేటీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి ఎన్నో తప్పులు చేశారని ఆరోపించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో కమీషన్లు తీసుకున్నారని, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో కమీషన్లు తీసుకున్నారని, చత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో అప్పటి మార్కెట్ ధర కంటే అధిక ధరకు ఒప్పందం చేసుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. తాము కేసీఆర్‌లా పథకాలను ఎగ్గొట్టమని, అన్ని హామీలు నెరవేరుస్తామన్నారు. మూసీ ప్రక్షాళనకు రూ.30 కోట్ల వరకు అవుతుందనేది తన వ్యక్తిగత అంచనా అన్నారు.

హైడ్రా వల్ల పేదలకు నష్టం జరిగితే వారిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని మహేశ్‌కుమార్ అన్నారు. హైడ్రా ఇప్పటి వరకు ఒకే ఒక పేద ఇల్లు కూల్చేసిందని, కానీ అన్నీ పేదల ఇళ్లే కూలుస్తున్నట్టు బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. వచ్చే డిసెంబర్ 7 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతుందని, ఆలోపు పార్టీలో అన్ని నియామకాలు పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో కులగణనపై వచ్చే నెలలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తామని, ఈ సదస్సుకు ఖర్గే, రాహుల్‌గాంధీని ఆహ్వానిస్తామని తెలిపారు.

పార్టీలోకి కొత్తగా వచ్చిన వారిని గౌరవించుకోవాల్సి ఉంటుందని మహేశ్‌కుమార్ పేర్కొన్నారు. పాత, కొత్త వారి మధ్య కలయికలో కాస్త ఇబ్బంది కనిపిస్తోందన్నారు. అందరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ముప్పై ఏళ్లుగా తన వెంటే ఉన్న కార్యకర్త హత్యకు గురి కావడంతో జీవన్‌రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారని, అందుకే  ఆవేదనలో అలా మాట్లాడారని పేర్కొన్నారు. కానీ పార్టీపై ఆయనకు వ్యతిరేకత లేదన్నారు. ఆయనకు పార్టీ అండగానే ఉంటుందని హామీ ఇచ్చారు.
Mahesh Kumar Goud
Congress
Telangana
KTR

More Telugu News