YS Sharmila: విజయసాయి కూడా అలాంటివాడే: షర్మిల కౌంటర్
- జగన్-షర్మిల ఆస్తుల వివాదంలో విజయసాయి వ్యాఖ్యలు
- షర్మిల గొడవ ఆస్తి కోసం కాదని అధికారం కోసం అని విమర్శలు
- చంద్రబాబు కళ్లలో ఆనందం కోసమే షర్మిల మీడియా సమావేశాలు అని వెల్లడి
- ఇది జగన్ ఇచ్చిన స్క్రిప్ట్ కాదని విజయసాయి ప్రమాణం చేయాలన్న షర్మిల
జగన్-షర్మిల ఆస్తుల పంపకం వివాదంలో తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా పలు వ్యాఖ్యలు చేశారు. ఆస్తి గొడవ అయితే పరిష్కారం చేసుకోవచ్చని, కానీ ఇది ఆస్తి గొడవ కాదని, అధికారం కోసం గొడవ అని విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు.
చంద్రబాబు కళ్లలో ఆనందం కోసమే షర్మిల మీడియా సమావేశాలు పెడుతుందని, షర్మిల మీడియా సమావేశాల్లో 95 శాతం జగన్ ను విమర్శించడమే ఉంటుందని వివరించారు. అసలు, జగన్ కు షర్మిల రాసిన లేఖ చంద్రబాబుకు ఎలా చేరిందని విజయసాయి ప్రశ్నించారు.
విజయసాయి వ్యాఖ్యలపై షర్మిల బదులిచ్చారు. విజయసాయి మాట్లాడిందంతా జగన్ ఇచ్చిన స్క్రిప్టేనని అన్నారు. జగన్ ఇచ్చిన స్ట్రిప్ట్ చదవలేదని విజయసాయిరెడ్డి ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. ఆస్తుల్లో నలుగురు బిడ్డలకు వాటా అని నాడు వైఎస్సార్ కరాఖండీగా తీర్మానించారని షర్మిల స్పష్టం చేశారు. ఆస్తుల పంపకంపై వైఎస్సార్ నిర్ణయం అబద్ధమని మీ బిడ్డలపై ప్రమాణం చేయగలరా? విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు.
విజయసాయి కూడా జగన్ మోచేతి నీళ్లు తాగిన వ్యక్తే... విజయసాయి రాజకీయంగా, ఆర్థికంగా జగన్ వల్ల బలపడ్డారు... విజయసాయి ఇలా మాట్లాడడంలో ఆశ్చర్యమేమీ లేదు అంటూ షర్మిల విమర్శనాస్త్రాలు సంధించారు.
"కేసుల నుంచి బయటపడేందుకు పొన్నవోలుతో కలిసి జగన్ కుట్ర చేయలేదా? కుట్ర చేయకపోతే జగన్ ముఖ్యమంత్రిగా కాగానే పొన్నవోలుకు ఏజీ పదవి ఎందుకు ఇచ్చారు? సొంత ప్రయోజనాల కోసం తల్లిని కోర్టుకు ఈడ్చిన విషపు నాగు జగన్" అని ధ్వజమెత్తారు.
ఇక, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానికి కాంగ్రెస్ ముమ్మాటికీ కారణం కాదు అని షర్మిల స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని వైఎస్సార్ రెండు పర్యాయాలు అధికారంలోకి తీసుకువచ్చారని వెల్లడించారు. బంగారు బాతును ఎవరూ చంపుకోరు... సొంత కళ్లను ఎవరూ పొడుచుకోరు అని వ్యాఖ్యానించారు.