Vijay Madduri: రాజ్ పాకాల ఫాంహౌస్ ఇష్యూపై సాఫ్టువేర్ కంపెనీ సీఈవో విజయ్ మద్దూరి కీలక వ్యాఖ్యలు
- తాను అనని మాటలను పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారన్న విజయ్ మద్దూరి
- ఫాంహౌస్‌లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగలేదని వెల్లడి
- తప్పుడు ప్రచారంతో తన ప్రతిష్ఠను మంటగలుపుతున్నారని ఆవేదన
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాంహౌస్‌పై పోలీసుల దాడులు, కేసు నమోదు చేయడంపై సాఫ్టువేర్ కంపెనీ సీఈవో విజయ్ మద్దూరి కీలక వ్యాఖ్యలు చేశాడు. రాజ్ పాకాల ఫాంహౌస్‌లో జరిగిన సోదాల్లో విజయ్ మద్దూరికి పాజిటివ్ వచ్చింది. దీంతో రాజ్ పాకాలతో పాటు, ఇతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేటీఆర్ బావమరిది తనకు మద్యం ఇవ్వడంతో తాను తీసుకున్నానని విజయ్ వాంగ్మూలం ఇచ్చినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. ఈ వాంగ్మూలంపై విజయ్ మద్దూరి స్పందించాడు.
తాను అనని మాటలను పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారని పేర్కొన్నాడు. తన మిత్రుడు రాజ్ పాకాల తమను కుటుంబ సమేతంగా దీపావళి వేడుక కోసం ఆహ్వానించాడని... ఫాంహౌస్‌లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగలేదని వెల్లడించాడు. కానీ తమను లక్ష్యంగా చేసుకొని పోలీసులు చేసిన ఆరోపణలు సరికాదన్నాడు. తాము ఎలాంటి తప్పూ చేయలేదన్నాడు.
ఇటీవలే తాము ప్రపంచ పర్యటన ముగించుకొని భారత్ కు వచ్చామని, ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులకు చూపించినట్లు చెప్పారు. అయినప్పటికీ వాళ్లు ఎఫ్ఐఆర్లో తాను చెప్పని మాటలు చెప్పినట్టుగా రాశారని వాపోయారు. తాను అమెరికన్ సిటిజన్‌ను అని... ముప్పై ఏళ్లకు పైగా సాఫ్టువేర్ రంగంలో అనుభవం ఉన్నవాడినని వెల్లడించారు. తప్పుడు ప్రచారంతో తన ప్రతిష్ఠను మంటగలుపుతున్నారని అన్నారు. నిజాలు ఎప్పటికైనా బయటకు వస్తాయన్నాడు.