Gary Kirsten: పాకిస్థాన్ క్రికెట్‌లో మరో కుదుపు.. కోచ్‌గా తప్పుకోనున్న గ్యారీ కిర్‌స్టన్!
- హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన 4 నెలలకే కిర్‌స్టన్ కీలక నిర్ణయం
- కోచ్, ఆటగాళ్ల మధ్య తీవ్రమైన అభిప్రాయ భేదాలు వచ్చాయని ’క్రిక్‌బజ్‘ కథనం
- అటు పీసీబీ నుంచి కూడా కిర్‌స్టన్‌కు దొరకని మద్దతు
- పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం
పాకిస్థాన్ క్రికెట్‌లో వరుస కుదుపులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే బాబర్ ఆజం వైట్‌బాల్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పడం, సెలక్షన్ కమిటీలో మార్పులు వంటివి చోటుచేసుకున్నాయి. తాజాగా ఇప్పుడు కోచ్ గ్యారీ కిర్‌స్టన్ తన పదవి నుంచి తప్పుకోనున్నట్టు తెలుస్తోంది. హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన 4 నెలలకే ఆయన ఈ నిర్ణయానికి రావడం చర్చనీయాంశమైంది.
కిర్‌స్టన్ పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి. బాబర్ ఆజం కెప్టెన్‌గా తిరిగి రావడం, ఆపై రాజీనామా చేయడం, సెలక్షన్ కమిటీలో మార్పులు తదితర ఘటనలు ఆయన 4 నెలల పదవీకాలంలోనే జరిగాయి.
గత కొన్ని వారాలుగా కోచ్ కిర్‌స్టన్, ఆ జట్టు ఆటగాళ్ల మధ్య కొన్ని తీవ్రమైన అభిప్రాయ భేదాలు వచ్చాయని ‘క్రిక్‌బజ్’ కథనం పేర్కొంది. అటు పీసీబీ నుంచి కూడా ఆయనకు సరైన మద్దతు లభించడం లేదని సమాచారం. డేవిడ్ రీడ్‌ను హైపర్ఫార్మెన్స్ కోచ్‌గా నియమించాలని కిర్‌స్టన్ ఇటీవల బోర్డును అభ్యర్థించాడు. కానీ, ఆయన అభ్యర్థనను పీసీబీ తిరస్కరించి, ప్రత్యామ్నాయంగా మరికొన్ని పేర్లను సూచించింది. దాంతో ఆయన నిరాశ చెందారని, ఈ నేపథ్యంలోనే ఆయన తన పదవి నుంచి తప్పుకోవాలని యోచిస్తున్నట్టు కథనం పేర్కొంది.
ఒకవేళ వైట్‌బాల్ కోచ్ పదవిని కిర్‌స్టన్ వదులుకుంటే.. రాబోయే రోజుల్లో పీసీబీ అతని వారసుడిగా జాసన్ గిల్లెస్పీని నియమించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం అతడు పాక్ టెస్టు జట్టుకు కోచ్‌గా ఉన్నాడు.
అలాగే రాబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో ఉంచుకుని పాకిస్థాన్ మాజీ పేసర్ ఆకిబ్ జావెద్‌ను వైట్‌బాల్ కోచ్‌గా నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం పాకిస్థాన్ జాతీయ సెలక్షన్ కమిటీ సభ్యులలో ఆకిబ్ ఒకరు. ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను పాక్ 2-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ అద్భుత ప్రదర్శనకు తెర వెనుక ఆకిబ్ కీలంగా వ్యవహరించారు.
ఇక పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తాజాగా ఆస్ట్రేలియా, జింబాబ్వే వైట్‌బాల్ టూర్ల కోసం జట్లను ప్రకటించింది. అయితే, ఆ రెండు పర్యటనలకు కిర్‌స్టన్ జట్లతో పాటుగా ఉండడని పీసీబీ వెల్లడించింది. సో.. ఆ జట్టు వైట్‌బాల్ కోచ్‌గా దాదాపు గ్యారీ కిర్‌స్టన్ తప్పుకున్నట్టేనని అర్థమవుతోంది.