Lucky Baskhar: నా జీవితంలో ఫస్ట్ చెక్ ఇప్పించింది త్రివిక్రమ్: విజయ్ దేవరకొండ
- లక్కీ భాస్కర్ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా విజయ్
- త్రివిక్రమ్‌తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్న విజయ్
- విజయ్ తనకు ఇష్టమైన నటుల్లో ఒకరని తెలిపిన త్రివిక్రమ్
''నేను నటించిన పెళ్లిచూపులు చిత్రం విజయం సాధించిన సమయంలో దర్శకుడు త్రివిక్రమ్ నన్ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆఫీస్ పిలిపించి నాతో మాట్లాడి, నాకు మొదటి అడ్వాన్స్‌గా చెక్ ఇప్పించారు'' అని హీరో విజయ్ దేవరకొండ ఆసక్తికర అంశం వెల్లడించారు. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం 'లక్కీ భాస్కర్'. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ నెల 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయ్ దేవరకొండ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ'' త్రివిక్రమ్ ఇప్పించిన చెక్ నా కెరీర్‌లో అందుకున్న మొదటి చెక్. దాదాపు ఇది జరిగి ఏడేళ్లవుతుంది. ఇప్పుడు సితారలో నేను సినిమా చేస్తున్నాను. వీడీ12. గౌతమ్ దర్శకత్వంలో సితారలో సినిమా చేయాలని రాసిపెట్టుందేమో. త్వరలోనే ఆ సినిమా ద్వారా మీ ముందుకు రాబోతున్నాను. ఆ రోజు నేను త్రివిక్రమ్‌ను కలుసుకోవడం నా జీవితంలో పెద్ద విషయం.
ఆయన నన్ను ఆఫీస్ కూర్చోబెట్టి నువ్వు స్టార్ అవుతావురా చెక్ తీసుకో అంటే... అప్పుడు ఎంత ఆనందంగా అనిపించిందో మాటల్లో చెప్పలేను. నా అభిమాన దర్శకుల్లో త్రివిక్రమ్ ముందు వరుసలో ఉంటారు. ఆయన సినిమాల్లో అతడు, ఖలేజా సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆయనను ఎప్పుడు కలిసినా జీవితం గురించి, రామాయణ, మహాభారతాల గురించి ఎంతో ఆసక్తిగా చెబుతుంటారు. ఆయన చెబుతుంటే వింటూ అలా కూర్చోవచ్చు. ఇక దుల్కర్ సల్మాన్ నటించిన ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
ఇక, ఇదే వేదికపై త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ'' నాకు బాగా ఇష్టమైన నటుల్లో విజయ్ ఒకరు. ప్రేమను, ద్వేషాన్ని రెండింటినీ విజయ్ చూశాడు. ఎంత ప్రేమను చూశాడో... అంతకంటే రెట్టింపు ద్వేషం కూడా చూశాడు. ఆ రెండూ చాలా తక్కువ టైంలో చూసి ఈ రోజు ఇంత గొప్ప పొజిషన్‌లో ఉండటం చాలా గొప్ప విషయం. విజయ్ చాలా గట్టోడు. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ అమృతం కురిసిన రాత్రిలో ఒక కవిత రాశారు. మా వాడే... మహ గట్టివాడు అని... మా విజయ్ మహా గట్టోడు, ఏం భయంలేదు'' అన్నారు.