KTR: హైడ్రా బ్లాక్‌మెయిల్ సంస్థ... రేవంత్ రెడ్డిపై హత్య కేసు నమోదు చేయాలి: కేటీఆర్
- కూకట్‌పల్లిలో బుచ్చమ్మ కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్
- నోటీసులు ఇవ్వకుండానే పేదల ఇళ్లు కూలగొడతారా? అని ఆగ్రహం
- ప్రభుత్వమే అనుమతులిచ్చి... ఇప్పుడు కూలగొట్టడంపై కేటీఆర్ ఆగ్రహం
సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రాపై హత్య కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. హైడ్రా కూల్చివేతల భయంతో కూకట్‌పల్లిలో ప్రాణాలు కోల్పోయిన బుచ్చమ్మ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... అర్థం పర్థం లేకుండా ఆనాలోచితంగా గుడ్డెద్దు చేలో పడినట్లు ఇష్టమొచ్చినట్లు కూకట్‌పల్లిలోని నల్ల చెరువు వద్ద కూల్చివేశారని మండిపడ్డారు.
హైడ్రా అనే బ్లాక్‌మెయిల్ సంస్థను పేదల మీదకు ఉసిగొల్పి.. నోటీసులు ఇవ్వకుండానే మీ ఇళ్లు కూలగొడతామంటూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భయానక వాతావారణం సృష్టించిందని ఆరోపించారు. పిల్లలు పుస్తకాలను తీసుకుంటామంటే కూడా తీసుకోనివ్వకుండా పేదల ఇళ్లు కూలగొడుతున్నారని ధ్వజమెత్తారు. ఎక్కడ తన ఇల్లు కూలగొడతారేమోనని ఆందోళనతో బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. బుచ్చమ్మ కుటుంబాన్ని చూస్తే బాధేస్తోందన్నారు. బుచ్చమ్మ కుటుంబానికి అండగా ఉంటామన్నారు.
ప్రభుత్వమే అనుమతులు ఇచ్చి... పన్నులు కట్టించుకొని... ఇప్పుడు అదే ప్రభుత్వం కూలగొడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా కారణంగానే బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుందన్నారు. ఇది ఆత్మహత్య కాదని, హైడ్రా అనే సంస్థతో రేవంత్ రెడ్డి చేయించిన హత్య అన్నారు. రేవంత్ ప్రభుత్వం దిక్కుమాలిన చర్యలతో పేదలు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేదశ్రీ అనే పాప ఏడుస్తూ పుస్తకాలు తీసుకుంటానంటే కూడా తీసుకోనీయకుండా ఇల్లు కూల్చారని విమర్శించారు. ఇంత అమానవీయంగా ప్రవర్తించడం దారుణమన్నారు.
అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇళ్లు కడతామని... ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని చెప్పారని, కానీ ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కట్టింది లేదు... పేదల ఇళ్లను మాత్రం కూల్చేశారని ఆరోపించారు. హైదరాబాద్‌లోనే కాదు గ్రామీణ ప్రాంతాల్లో కూడా రేవంత్ రెడ్డి అరాచకం గురించి చర్చించుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డి, ఆయన కేబినెట్ మంత్రులు ఏం చేస్తున్నారో ప్రజలంతా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. హైడ్రా పేరుతో బ్లాక్ మెయిల్ దందా చేస్తున్నారా? అని నిలదీశారు. నీ మంత్రులది, నీ తమ్ముళ్లదీ ఇదే దందానా? బిల్డర్లను బెదిరించి చందాలు తీసుకోవడానికే ఈ ప్రభుత్వం ఉందా? గరీబోళ్ళ ఇళ్లు కూలగొట్టి హైడ్రా పేరుతో దందా చేస్తున్నారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
రాష్ట్రంలో ఈరోజు అరాచక ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. గరీబోళ్ల పొట్ట కొట్టే ప్రభుత్వ చర్యలపై తాము పోరాడుతామన్నారు. హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పగ బట్టిందన్నారు. కచ్చితంగా ఈ ప్రభుత్వం మీద మనమంతా తిరగబడాలని పిలుపునిచ్చారు.