Chiranjeevi: నేను రచ్చ గెలిచి... ఇంట గెలిచాను: చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు

Chiranjeevi shares his experience of his mother fanism on Akkineni Nageswara rao
  • నాగార్జున మనస్ఫూర్తిగా అవార్డు ఇచ్చాడు... ఇప్పుడు ఇంట గెలిచాననిపిస్తోందన్న చిరంజీవి
  • తన గురువు, మెంటార్, స్ఫూర్తిదాత అమితాబ్ బచ్చన్ అన్న చిరంజీవి
  • నా తల్లి నాగేశ్వరరావు అభిమాని అని వెల్లడించిన మెగాస్టార్
  • ఆరోగ్యం విషయంలో తనకు నాగార్జున స్ఫూర్తిదాయకమని వ్యాఖ్య
ఇంట గెలిచి రచ్చ గెలవాలని మన తెలుగులో ఓ నానుడి ఉందని, కానీ నేను మాత్రం రచ్చ గెలిచి ఇంట గెలిచానేమో అనిపిస్తోందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తాను సినిమాల్లో ఎదుగుతున్న సమయంలో బయట ఆడియన్స్ నుంచి, ఇతరుల నుంచి తనకు చక్కటి ప్రశంసలు వచ్చేవని, కానీ తన తండ్రి మాత్రం ఎప్పుడూ పొగిడేవాడు కాదని గుర్తు చేసుకున్నారు. కానీ బయట ఎన్ని పొగడ్తలు వచ్చినా... ఇంట్లో గెలిస్తే ఉండే సంతోషం వేరన్నారు. కానీ తన తండ్రి తనను పొగుడుతుంటాడని తన తల్లి తనకు చెప్పారన్నారు. అంటే తాను రచ్చ గెలిచాక ఇంట కూడా గెలిచానన్నారు.

అలాగే సినిమా పరిశ్రమలోనూ వజ్రోత్సవాల సమయంలో తనకు లెజెండరీ అవార్డు ఇచ్చినప్పుడు కొంతమంది వ్యతిరేకించడంతో దానిని తాను తీసుకోకుండా క్యాప్సూల్ బాక్సులో వేశానన్నారు. తనకు అర్హత వచ్చినప్పుడే తీసుకుంటానని చెప్పానని... కాబట్టి ఆ రోజు తాను ఇంట గెలవలేకపోయానన్నారు. కానీ ఇప్పుడు ఏఎన్ఆర్ జాతీయ అవార్డు ఇచ్చిన ఈ రోజున... అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఇచ్చిన ఈ రోజున... నా మిత్రుడు (నాగార్జున) నాకు మనస్ఫూర్తిగా ఈ అవార్డు ఇచ్చిన రోజున... ఇప్పుడు నాకు ఇంట గెలిచానని అనిపిస్తోందన్నారు. నేను ఇంటా గెలిచాను... రచ్చా గెలిచానన్నారు.

తన గురువు, మెంటార్, స్ఫూర్తిదాత అమితాబ్ బచ్చన్ అన్నారు. తనకు ఏ మంచి జరిగినా ఆయన నుంచి శుభాకాంక్షలు వస్తాయన్నారు. అమితాబ్ చేతుల మీదుగా తనకు ఈ అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు. తనకు పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు 'చిరంజీవి కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా' అని అమితాబ్ తనను ప్రశంసించారన్నారు. ఆ వ్యాఖ్యలతో తన నోటమాట రాలేదన్నారు. కానీ ఆయన మాటలు తనకు ఎంతో ప్రోత్సాహాన్ని, ఆనందాన్ని ఇచ్చాయన్నారు.

1990లో తాను హిందీలో ప్రతిబంధ్ సినిమా తీసినప్పుడు.. అమితాబ్‌కు చూపించానన్నారు. ఆయన చూస్తున్నంతసేపు ఆందోళనగా ఉన్నానని తెలిపారు. సినిమా చూశాక మాత్రం అమితాబ్ తనను ప్రశంసించారన్నారు. సైరా సినిమా కోసం అమితాబ్ బచ్చన్‌ను సంప్రదించాలని సినిమా టీమ్ భావించిన సమయంలో తాను మెసేజ్ పంపితే వెంటనే స్పందించారని గుర్తు చేసుకున్నారు. సినిమా అయ్యాక పారితోషికం వంటి ఫార్మాలిటీస్ విషయంలోనూ ఆయన తన పట్ల ఎంతో అభిమానం చూపించారన్నారు.

ఏఎన్ఆర్, అమితాబ్‌తో తనకు ఆత్మీయ అనుబంధం ఉందన్నారు. తన తల్లి... ఏఎన్ఆర్ అభిమాని అని చిరంజీవి వెల్లడించారు. "సినిమాల్లో డ్యాన్స్‌ను పరిచయం చేసింది నేనే కానీ... డ్యాన్స్ స్పీడ్‌ను, గ్రేస్‌ను పెంచింది మాత్రం చిరంజీవే" అని నాగేశ్వరరావు తనను ప్రశంసించారన్నారు. నాగేశ్వరరావు ఓ ఎన్‌సైక్లోపీడియా అన్నారు. ఆయనతో మెకానిక్ అల్లుడు సినిమాలో నటించే అవకాశం దక్కిందన్నారు. ఆరోగ్యం విషయంలో నాగార్జున తనకు స్ఫూర్తి అన్నారు.
Chiranjeevi
Amitabh Bachchan
Nagarjuna
Tollywood

More Telugu News