Indian Soldiers: చైనీస్ భాషలో పట్టభద్రులైన తూర్పు కమాండ్ కు చెందిన భారత జవాన్లు
- గాంధీనగర్‌లోని రాష్ట్రీయ రక్షా యూనివర్శిటీలో ధృవపత్రాల అందజేత
- ఎల్ఏసీ వద్ద పహారాలో ఉన్న వారికి భాషా నైపుణ్యాల్లో సన్నద్ధం
- ఎల్ఏసీలో శాంతి నెలకొనేందుకు ఈ పరిణామం ఉపయోగకరం
భారత సైన్యం తూర్పు కమాండ్ చెందిన 20 మంది జవాన్లు చైనీస్ భాషలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమాను అందుకున్నారు. గుజరాత్ లోని గాంధీనగర్ సమీపంలోని రాష్ట్రీయ రక్షా యూనివర్శిటీ (ఆర్ ఆర్‌యూ)లో శనివారం జరిగిన కార్యక్రమంలో వారికి ధృవపత్రాలు అందజేశారు.
చైనాతో 3,488 కి.మీ. వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి మోహరించి ఉన్న ఈ సైనికులను ఫ్లాగ్ మీటింగ్‌లు, ట్రూప్‌లో పాల్గొనడానికి అవసరమైన భాషా నైపుణ్యాలతో సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆర్ ఆర్‌యూ ఉపకులపతి ప్రొఫెసర్ బిమల్ పటేల్ మాట్లాడుతూ.. దౌత్యపరమైన సమావేశాల్లో కమ్యునికేషన్ చాలా కీలకమన్నారు. ఈ నేపథ్యంలో చైనీస్ భాషలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమా సాధించిన సైనికులు కమ్యునికేషన్ పరంగా ఉపయోగపడతారన్నారు. జవాన్ల భాషా నైపుణ్యాలు దౌత్యానికి కొత్త, వ్యూహాత్మక విధానాన్ని సూచిస్తాయని, సరిహద్దుల్లో పరస్పరం గౌరవాన్ని పొంపొందించుకోవడానికి దోహదపడతాయన్నారు.