Chiranjeevi: వజ్రోత్సవాల వేడుకలో జరిగిందేమిటి? చిరంజీవి తన అవార్డును ఆవేళ ఎందుకు టైమ్ క్యాప్యూల్స్‌ బాక్స్‌లో వేశారో తెలుసా?

What happened at the Diamond Jubilee celebration Do you know why the Chiranjeevi award was buried
  • ఏఎన్‌ఆర్‌ అవార్డు అందుకున్న మెగాస్టార్‌ చిరంజీవి 
  • లెజండరీ అవార్డు రిజెక్ట్‌ చేసిన క్షణాలను గుర్తుచేసుకున్న చిరు 
  • సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వజ్రోత్సవాల వీడియోలు
అగ్ర కథానాయకుడు చిరంజీవి ఈ రోజు (సోమవారం) అమితాబ్‌ బచ్చన్‌ చేతుల మీదుగా ఏఎన్‌ఆర్‌ జాతీయ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అవార్డు స్వీకరించిన తరువాత చిరంజీవి భావోద్వేగ ప్రసంగం చేశారు. 2007లో జరిగిన తెలుగు సినీ పరిశ్రమ వజ్రోత్సవాలలో జరిగిన సంఘటనను గుర్తుచేసుకున్నాడు. వజ్రోత్సవాల సమయంలో తనకు లెజెండరీ అవార్డు ఇచ్చినప్పుడు కొంతమంది వ్యతిరేకించడంతో దానిని తాను తీసుకోకుండా క్యాప్సూల్ బాక్సులో వేశానన్నారు. 

తనకు అర్హత వచ్చినప్పుడే తీసుకుంటానని చెప్పానని... కాబట్టి ఆ రోజు తాను ఇంట గెలవలేకపోయానన్నారు. కానీ ఇప్పుడు ఏఎన్ఆర్ జాతీయ అవార్డు ఇచ్చిన ఈ రోజున... అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఇచ్చిన ఈ రోజున... నా మిత్రుడు (నాగార్జున) నాకు మనస్ఫూర్తిగా ఈ అవార్డు ఇచ్చిన రోజున... ఇప్పుడు నాకు ఇంట గెలిచానని అనిపిస్తోందన్నారు. నేను ఇంటా గెలిచాను... రచ్చా' గెలిచానన్నారు. 

అయితే వజ్రోత్సవాల సమయంలో అప్పుడు ఏం జరిగిందనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అందరూ వజ్రోత్సవ వేడుక వీడియోలను యూట్యూబ్‌లో వెతుకుతున్నారు. సో.. అసలు ఏం జరిగిందో ఒకసారి గుర్తుచేసుకుందాం.. 

వజ్రోత్సవాల వేడుకలో చిరంజీవి లెజండరీ అవార్డు అందుకున్న తరువాత డా.మోహన్‌బాబు ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ ''ఈ వజ్రోత్సవాల వేడుకలో మిమ్ములను సన్మానిస్తున్నాం అని చెప్పారు. నేను వద్దన్నాను. అయితే వాళ్లు మీరు లెజెండ్‌ కాదు.. మిమ్ములను సెలబ్రిటీగా సన్మానం చేయాలనుకుంటున్నాం అన్నారు. అసలు లెజెండ్‌ అంటే ఏమిటి? సెలబ్రిటీ అంటే ఏమిటి? ముందు మీరు దాని మీద ఓ పుస్తకం ప్రచురించండి. సెలబ్రిటీని ఇలా గౌరవించాలి. లెజెండ్‌కు ఇలాంటి క్వాలిటీస్‌ వుండాలి అని చెప్పండి'' అని వ్యాఖ్యానించారు. 

తదనంతరం చిరంజీవి ప్రసంగిస్తూ ''నాకు లెజెండరీ సన్మానం చేస్తా అన్నప్పుడు నేను వద్దన్నాను. ఎందుకంటే డా.డి.రామానాయుడు, డీవీఎస్‌ రాజు, బాపు, దాసరి ఇంత మంది పెద్దల్లో నేను చాలా చిన్నవాడిగా కనిపిస్తాను. వెంకటేశ్‌, నాగార్జున, బాలకృష్ణలతో సమకాలీకుడిని. నన్ను లెజెండ్‌ని చేసి వాళ్ల నుంచి దూరం చేయకండి అన్నాను. బట్‌.. నన్ను కన్విన్స్  చేశారు. కానీ ఇప్పుడు చెబుతున్నాను. ఈ అవార్డును నేను యాక్సెప్ట్‌ చేయడం లేదు. నేను అవార్డును సరెండర్‌ చేస్తున్నాను. 

ఈ అవార్డును, శాలువాను, టైమ్‌ క్యాప్యూల్స్‌ బాక్స్‌లో వుంచుతున్నాను. తెలుగు సినిమా 100 సంవత్సరాల వేడుకలో అంటే 25 సంవత్సరాల తరువాత నేను అర్హుడిని అనిపిస్తే నా తోటి హీరోలందరూ కూడా అది కరెక్ట్‌ అనిపిస్తే వాళ్ల సమక్షంలోనే ఈ అవార్డును అందుకుంటా. అప్పటి దాకా ఈ అవార్డును టైమ్‌ క్యాప్యూల్స్‌లో సమాధి చేస్తున్నాను. అప్పటి వరకు సినీ పరిశ్రమలో వుంటాను..'' అంటూ చిరంజీవి ఆవేశంగా ప్రసంగించి వెళ్లిపోయారు.
Chiranjeevi
Megastar
ANRNationalAward
ANRNationalAward2024
Tollywood
Nagarjuna
Anr

More Telugu News