Matthew Wade: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మాథ్యూ వేడ్‌

Gujarat Titans Star Matthew Wade Announces Retirement From International Cricket

  • ఆస్ట్రేలియా తరఫున 225 అంతర్జాతీయ మ్యాచ్‌ల‌కు ప్రాతినిధ్యం వ‌హించిన వేడ్‌
  • ఇందులో 92 టీ20లు, 97 వ‌న్డేలు, 36 టెస్టులు 
  • ఐపీఎల్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌కు ఆడిన ఆసీస్ క్రికెట‌ర్‌
  • రిటైర్మెంట్ త‌ర్వాత ఆసీస్ కోచింగ్ స్టాఫ్‌లో చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించిన వేడ్‌

ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్, బ్యాటర్ మాథ్యూ వేడ్‌ మంగళవారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 13 ఏళ్ల అతని సుదీర్ఘ క్రికెట్‌ కెరీర్‌లో ఆస్ట్రేలియా తరఫున 225 అంతర్జాతీయ మ్యాచ్‌ల‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. 36 ఏళ్ల వేడ్ టీ20 ప్రపంచ కప్‌లో మూడు ఎడిషన్లలో తన దేశం కోసం ఆడాడు. 2021లో అతను వైస్ కెప్టెన్‌గా ఉన్న స‌మ‌యంలోనే ఆస్ట్రేలియాను దుబాయ్‌లో తొలి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ టైటిల్‌ను ముద్దాడింది.

ఈ టోర్నీలో వేడ్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. ముఖ్యంగా సెమీ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై అత‌డు ఆడిన తుపాన్ ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండి పోతుంది. కేవలం 17 బంతుల్లోనే 41 (నాటౌట్‌) ర‌న్స్‌తో ఆసీస్‌కు థ్రిల్లింగ్ విక్ట‌రీని అందించాడు.

ఆస్ట్రేలియా త‌ర‌ఫున మొత్తం 92 టీ20లకు ప్రాతినిధ్యం వ‌హించిన వేడ్‌ 134.15 స్ట్రైక్ రేట్‌, 26.03 సగటుతో 1,202 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యుత్తమ వ్య‌క్తిగ‌త స్కోరు 80.

అలాగే అతను ఆసీస్ త‌ర‌ఫున‌ 97 వ‌న్డేలు కూడా ఆడాడు. 83 ఇన్నింగ్స్‌లలో 26.29 సగటుతో 1,867 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 11 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

ఆస్ట్రేలియా తరపున 36 టెస్టు మ్యాచ్‌లు ఆడిన వేడ్ 29.87 సగటుతో 1,613 ర‌న్స్ చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, ఐదు అర్ధసెంచరీలు ఉన్నాయి. 2019లో ది ఓవల్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదవ యాషెస్ టెస్టులో చేసిన‌ 117 పరుగుల అత‌ని కెరీర్‌లో అత్యుత్తమ వ్య‌క్తిగ‌త‌ స్కోరు.

ఇక మాథ్యూ వేడ్‌ ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్‌లో కూడా మెరిశాడు. ఐపీఎల్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. ప్ర‌స్తుతం అత‌ను ఆసీస్ కోచింగ్ స్టాఫ్‌లోకి చేరిన‌ట్లు తెలుస్తోంది. వచ్చే నెల పాకిస్థాన్‌తో స్వదేశంలో జ‌రిగే టీ20 సిరీస్ నుంచి తన కోచింగ్ ప్రయాణాన్ని ప్రారంభించ‌నున్నాడు.

"గత టీ20 ప్రపంచ కప్ ముగిసే సమయానికి నా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ ముగిసిపోయింద‌ని నాకు తెలుసు. నా అంతర్జాతీయ రిటైర్మెంట్, కోచింగ్‌పై గత ఆరు నెలలుగా జార్జ్ బెయిలీ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ తో నిరంతరం చ‌ర్చ‌ జరిగింది. వేసవి నెలల్లో బీబీఎల్‌ (బిగ్ బాష్ లీగ్), ఇత‌ర‌ ఫ్రాంచైజీ లీగ్‌లను ఆడటం కొనసాగిస్తాను. కానీ కోచింగ్‌పైనే ఎక్కువ‌గా దృష్టిసారించ‌డం జ‌రుగుతుంది" అని వేడ్ పేర్కొన్న‌ట్లు ఐసీసీ కోట్ చేసింది.

"నా అంతర్జాతీయ కెరీర్ ముగుస్తున్నందున, నా ఆస్ట్రేలియన్ సహచరులు, సిబ్బంది, కోచ్‌లందరికీ నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. అంతర్జాతీయ స్థాయిలో నేను ఆడిన ప్ర‌తిక్ష‌ణాన్ని ఆస్వాదించాను. నా చుట్టూ మంచి వ్యక్తులు ఉండ‌డం వ‌ల్లే ఇంత సుదీర్ఘ కెరీర్‌ను కొన‌సాగించ‌గ‌లిగాను" అని మాథ్యూ వేడ్ చెప్పుకొచ్చాడు. 

  • Loading...

More Telugu News