Anagani Satya Prasad: ఆస్తి గొడవలను షర్మిల బయటపెడితే టీడీపీని విమర్శించడమేంటి?: మంత్రి సత్యప్రసాద్
- వైఎస్ కుటుంబ సమస్యను టీడీపీకి ఆపాదించడం దారుణమన్న మంత్రి
- వైసీపీ పార్టీ పుట్టిందే అబద్దాల పునాది మీద అంటూ విమర్శ
- వైసీపీ నేతలు అబద్దాలను నిజం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్
ఏపీలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కుటుంబ ఆస్తుల వివాదం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే. ఆస్తుల కోసం సొంత తల్లి, చెల్లిని జగన్ కోర్టుకు ఈడ్చారంటూ కథనాలు వచ్చాయి. అయితే, ఈ సమస్యను టీడీపీకి ఆపాదించడం దారుణమని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.
ఆస్తి గొడవలను షర్మిల బయటపెడితే టీడీపీని విమర్శించడమేంటి? అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ పార్టీ పుట్టిందే అబద్ధాల పునాది మీద అని విమర్శించారు. అందుకే వైసీపీ నేతలు అబద్ధాలను నిజం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. మంగళవారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి... మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, ప్రస్తుతం ఏపీలో సుభిక్షమైన పాలన కొనసాగుతోందన్నారు. సీఎం చంద్రబాబు 130 కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, ఈ కార్యక్రమాలు విజయవంతం కావాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.
ఇక శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లిన మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం పండితులు ఆలయ మర్యాదల ప్రకారం తీర్థప్రసాదాలు అందించారు.