KTR: విద్యుత్ ఛార్జీల పెంపును ఈఆర్సీ తిరస్కరించింది... సంబరాలు చేయండి: కేటీఆర్
- పబ్లిక్ హియరింగ్ ద్వారా ఛార్జీలు పెంచకుండా ఈఆర్సీని ఒప్పించగలిగామన్న కేటీఆర్
- తద్వారా ప్రజలపై రూ.18,500 కోట్ల భారం పడకుండా ఆపామని వెల్లడి
- రాష్ట్ర చరిత్రలో పెంపు ప్రతిపాదనను ఈఆర్సీ తిరస్కరించడం ఇదే మొదటిసారన్న కేటీఆర్
విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను ఈఆర్సీ (విద్యుత్ నియంత్రణ మండలి) తిరస్కరించినందుకు గాను తెలంగాణవ్యాప్తంగా సంబరాలు జరపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. 10 నెలల కాలంలోనే రూ.18,500 కోట్ల విద్యుత్ ఛార్జీల పెంపునకు ప్రతిపాదనలను ప్రభుత్వం చేసిందని, కానీ ప్రధాన ప్రతిపక్షంగా వాటిని వ్యతిరేకించాలని పబ్లిక్ హియరింగ్‌లో పాల్గొని ఈఆర్సీని బీఆర్ఎస్ ఒప్పించగలిగిందన్నారు.
తద్వారా ప్రజలపై రూ.18,500 కోట్లు భారం పడకుండా ఆపగలిగామని, ఇందుకు విజయసూచికగా సంబరాలు నిర్వహించాలన్నారు. జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో సంబరాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర చరిత్రలో ప్రధాన ప్రతిపక్షం వాదన విని ఛార్జీల పెంపు ప్రతిపాదనలను ఈఆర్సీ తిరస్కరించడం ఇదే మొదటిసారి అన్నారు.
ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల గొంతుకను వినిపించిన ఈ సందర్భం చారిత్రాత్మకమన్నారు. విద్యుత్ ఛార్జీలను అడ్డగోలుగా పెంచి ప్రజలపై భారం వేయాలని ప్రభుత్వం చూసిందని, ప్రధాన ప్రతిపక్షంగా మనం అడ్డుకున్నామన్నారు. ప్రజాభిప్రాయ సేకరణతో ఈఆర్సీని ఒప్పించినట్లు కేటీఆర్ తెలిపారు. ప్రజలపై భారీ విద్యుత్ భారం మోపకుండా ప్రజల పక్షాన నిలిచిన ఈఆర్సీకి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.